Begin typing your search above and press return to search.

మారుతియే పక్కా కమర్షియల్: రావు రమేశ్

By:  Tupaki Desk   |   27 Jun 2022 2:30 AM GMT
మారుతియే పక్కా కమర్షియల్: రావు రమేశ్
X
తెలుగు తెరపై రావు గోపాలరావు విలనిజానికీ ఒక ప్రత్యేకత ఉంది. కూల్ గా కనిపిస్తూనే హీరోకి చెమటలు పట్టించే తీరు .. ఆ డైలాగ్స్ లోని విరుపు మరొకరికి సాధ్యం కాలేదు. అలాంటి రావు గోపాలరావు తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రావు రమేశ్ కూడా విలన్ గా ఎదిగారు. తండ్రిని ఎంతమాత్రం అనుకరించకుండా తనదైన ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. 'పక్కా కమర్షియల్' సినిమాలో ఆయన ఒక కీలకమైన పాత్రను పోషించారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రావు రమేశ్ మాట్లాడుతూ .. " ఇందాకటి నుంచి స్టేజ్ ఎవరు ఎక్కినా 'మీ దృష్టిలో పక్కా కమర్షియల్' ఎవరు? అని అడుగుతున్నారు. నా దృష్టిలో అల్లు అరవింద్ గారు గానీ .. గోపీచంద్ గారు గానీ .. రాశి ఖన్నా గాని పక్కా కమర్షియల్ కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్లలో పక్కా కమర్షియల్ అంటే మారుతి గారే. ఎందుకు మారుతి గారు పక్కా కమర్షియల్ అంటే, కేవలం ఆయన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా తీసే డైరెక్టర్ కనుక. ఇంతకు మించిన పక్కా కమర్షియల్ డైరెక్టర్ మరొకరు ఉండరు.

ఇంతకుముందు నేను మారుతి గారి దర్శకత్వంలో ' ప్రతిరోజూ పండగే' సినిమా చేశాను. అందులోని సీన్స్ కథను బట్టి ఉంటాయి. కానీ ఈ సినిమాలో మేము సీన్ దాటేసి చేయవలసి వచ్చింది. ఎందుకండీ అని ఏ డౌట్ ను అడిగినా, ఇలా ఉంటే ఆడియన్స్ ఇష్టపడతారు సార్ అనేవారు. నిజంగా ఆయనతో కలిసి పనిచేయడం జోష్ ను ఇస్తుంది. తన సినిమాల్లో కేవలం హీరోకి మాత్రమే కాకుండా, ఆయన చుట్టూ ఉండే సపోర్టింగ్ రోల్స్ కి చాలా స్పేస్ ఇస్తారు. ఈ సినిమా విషయంలో గోపీచంద్ గారు చాలా స్పోర్టివ్ గా ఉన్నారు. రాశిఖన్నా గారు కామెడీ ఇరగదీశారు.

నాన్నగారు విలన్ గా చేసిన సినిమాల్లో ఆయన పంచ లాగేస్తూ అల్లు రామలింగయ్య గారు కనిపించేవారు. అలా ఈ సినిమాలో నా వెనుక అజయ్ ఘోష్ గారిని పెట్టిన విధానం బాగుంది. ముఖ్యంగా కెమెరా వర్క్ .. సంగీతం ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా హిట్ కావాలని ఇందులో చేసిన ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందులో ముందు నేనుంటాను. మారుతి గారి సినిమాల్లో డైలాగ్ చెప్పేసి వెళ్లడం కుదరదు .. ఎందుకంటే ఆయన స్టైల్ వేరు. కామెడీనీ .. ఎంటర్టైన్ మెంట్ ను అందించే విషయంలో ఆయన మార్క్ వేరే. అందుకు నేను ఆయనకి హ్యాట్సాఫ్ చెబుతున్నాను" అంటూ ముగించారు.