ప్రతిష్టాత్మక చిత్రోత్సవాలకు ‘రంగస్థలం’!

Wed Jul 11 2018 22:54:20 GMT+0530 (IST)

Rangasthalam To be Played in Melbourne Film Festival

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా విలక్షణ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం` సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చెర్రీ నటనకు ప్రేక్షకులతోపాటు విమర్శకుల నుంచీ ప్రశంసలు దక్కాయి. `సౌండ్ ఇంజనీర్` సిట్టిబాబు రీసౌండ్ కు బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన  ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. ప్రస్తుతానికి చెర్రీ కెరీర్ బెస్ట్ గా నిలిచిన ఈ చిత్రం....మరో మైలురాయిని అందుకుంది. చెర్నీ నట విశ్వరూపం చూపించిన ఈ చిత్రానికి....తాజాగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఆస్ట్రేలియాలో జరగబోతోన్న అంతర్జాతీయ చిత్రోత్సవ ప్రదర్శనకు  `రంగస్థలం`ఎంపికైంది.ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఆగస్టులో జరగబోతోన్న `ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్` అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ‘రంగస్థలం’ ఎంపికైంది. ఆగస్టు 10 నుంచి 22 వరకూ జరగనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రాల కేటగిరికి‘రంగస్థలం’ఎంపికైంది. ఆ చిత్రోత్సవాల్లో ‘రంగస్థలం’ చిత్రాన్ని స్క్రీనింగ్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఆ చిత్రోత్సవాలకు చెర్రీని ప్రత్యేక అతిథిగా నిర్వాహకులు ఆహ్వానించారు. దీంతో ఈ ఏడాది జరగబోతోన్న పలు చిత్రోత్సవాలకూ ‘రంగస్థలం’ను పంపాలని నిర్మాతలు భావిస్తున్నారు. నాన్ బాహుబలి కేటగిరీలో `రంగస్థలం` మరింత గుర్తింపు తెచ్చుకునే దిశగా దూసుకువెళుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు.