కాపీ కొట్టారంటారని ముందే చెప్పేస్తున్నా!

Tue Aug 13 2019 23:00:01 GMT+0530 (IST)

Ranarangam Movie Inspired By The Godfather Movie

గుబురు గడ్డం మీసాలు.. మాసిన తలకట్టు.. రగ్గ్ డ్ లుక్.. గన్ చేతపట్టి ధనాధన్ పేల్చేయడం.. బ్రూటల్ మర్డర్స్ .. ఇవన్నీ గ్యాంగ్ స్టర్ సినిమాల్లోనే చూస్తాం. శర్వా రణరంగం గ్యాంగ్ స్టర్ స్టోరీనే. అయితే ఈ కథకు ఇన్ స్పిరేషన్ ఏ సినిమా? అని అడిగేస్తే దర్శకుడు సుధీర్ వర్మ బహిరంగంగానే ఆ టాప్ సీక్రెట్ ని చెప్పేశారు.గ్యాంగ్ స్టర్ సినిమా అనగానే `గాడ్ ఫాదర్` అందరికీ స్ఫూర్తి. ఆ తరహా లైన్ నే ఎంచుకున్నాం. అయితే మన కల్చర్ నేటివిటీని చూపిస్తాం. 1990 సమయంలో వైజాగ్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాం. అప్పట్లో ఒక యువకుడి చుట్టూ సాగే కథాంశం ఇది. అలాగే ఈ సినిమాలో ఒక ట్రైన్ ఎపిసోడ్ ఉంది. దానికి `ది అసాసియేషన్ ఆప్ జెస్సీ జేమ్స్` అనే హాలీవుడ్ సినిమాలో సన్నివేశం ఇన్ స్పిరేషన్ అని సుధీర్ వర్మ తెలిపారు. ముందే చెప్పేస్తే ఎవరూ అడగరు కదా.. అందుకే ఇలా చెప్పేస్తున్నానని అన్నారు. ఆ సినిమాని చాలా తక్కువ మంది మాత్రమే చూసి ఉంటారని అన్నారు. కాపీ కొట్టారు అనకుండా ముందే చెప్పేస్తున్నానని అన్నారు.

ఇటీవల కాపీ క్యాట్ వివాదాల పేరుతో మీడియా బోలెడంత రచ్చ చేస్తోంది. అందుకే యువ దర్శకుడు కాస్తంత జాగ్రత్తగానే ఉన్నట్టు అనిపిస్తోంది. రణరంగం చిత్రానికి కథ పరంగా ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందారో మీడియా ముందు చెప్పేసారు సుధీర్ వర్మ. అలా చెప్పేయడం కూడా ఒక రకంగా మంచిదే. ఇస్మార్ట్ శంకర్.. మన్మధుడు 2 సినిమాల్ని హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితోనే తీశారు. కానీ ఆ రహస్యం దాచి చివర్లో రిలీజ్ టైమ్ లో ఓపెన్ అయ్యారు. దానివల్ల అప్పటికే ఫలానా సినిమాకి కాపీ అంట కదా! అని అనవసర ప్రొపగండా సాగిపోయింది. అలా కాకుండా ఫలానా సన్నివేశానికి ఆ ట్రైన్ ఎపిసోడ్ ఇన్ స్పిరేషన్. అంత బాగా తీయడానికి ప్రయత్నించాం! నచ్చిందో లేదో మీరే చెప్పండి! అనేయడం తెలివైన పనే!!