రానా-మిహీక.. పెళ్లికి ముందు పటాసే

Mon Aug 03 2020 14:20:00 GMT+0530 (IST)

Rana Wedding Celebrations in Full Swing

ఓ వైపు మహమ్మారీ అట్టుడికిస్తున్నా పెళ్లి వేడుకలు ఆగడం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీలంతా ముహూర్తం మార్చే ఆలోచనను విరమించుకుంటున్నారు. మొదట నిఖిల్.. ఆ తర్వాత నితిన్ అదే పని చేశారు. ప్రేమించిన యువతి మెడలో మూడు ముళ్లు వేసారు. ఇప్పుడు భళ్లాలదేవ రానా కూడా అందుకు అతీతుడేం కాదు.



తొలుత ఘనమైన పెళ్లి అనుకున్నా కానీ అంతలోనే మనసు మార్చుకున్నాడు. ఆగస్టు 8న హైదరాబాద్ లో సింపుల్ గా తాను ప్రేమించిన మిహీక బజాజ్ ని పెళ్లాడేస్తున్నాడు. ఈ వేడుకకు కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే అటెండ్ కానున్నారు. ఇక పెళ్లికి ముందు పటాసే. నేటి నుంచి చూస్తే.. పెళ్లికి సరిగ్గా మరో ఐదు రోజులే సమయం ఉంది. అన్నీ వరుస పార్టీలేనట. ఇప్పటికే రోకా వేడుక పూర్తయింది. మెహందీ.. సంగీత్.. బ్యాచిలర్ పార్టీ ఇలా వేడుకలతో రానా- మిహీక జంట బిజీగా ఉన్నారట.

ఆసక్తికరంగా దగ్గుబాటి ఫ్యామిలీ.. బజాజ్ ఫ్యామిలీ హైదరాబాద్ వాస్తవ్యులే కాబట్టి ఒకే పరిసరాల్లో ఉండడం.. ఈ కరోనా మహమ్మారి కాలంలో ఇరు కుటుంబాలకు కలిసొచ్చింది. దీనివల్ల వివాహానికి ముందు వేడుకలు నిర్వహించడం సులభమైంది. ప్రేయసికి ప్రపోజ్ చేసే ముందు నేరుగా బజాజ్ ఫ్యామిలీ కి ప్రపోజ్ చేసిన రానా ఆ తర్వాత మిహీకతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మిహీక దగ్గుబాటి కుటుంబానికి చాలా కాలంగా సన్నిహితురాలే. రానా బాబాయ్ అయిన విక్టరీ వెంకటేష్ కుమార్తెకు స్నేహితురాలు. అయినా రానా లవ్ స్టోరి ఎంతో ఆసక్తికరం. ఇప్పటికి స్నేహబంధం కాస్తా వివాహబంధంగా మారుతోంది.