రానా లుక్.. 'లీడర్' లా ఉన్నాడు!

Sun Oct 13 2019 10:12:15 GMT+0530 (IST)

యువహీరో రానా దగ్గుబాటి మ్యాచో మ్యాన్ లుక్ అభిమానుల కళ్ల ముందు నుంచి చెరిగిపోవడం లేదు. భళ్లాలదేవగా అతడు బాహుబలి చిత్రంలో భీకర పోరాటాలు చేస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరికి ఇంకా కళ్ల ముందే మెదులుతున్నాయి. అయితే ఇంతలోనే రానా అనారోగ్యం కారణంగా సన్నబడడం అభిమానులను షాక్ కి గురి చేసింది. రానా ఆరోగ్యం ఏమంత బాలేదు అంటూ మీడియా సాగించిన ప్రచారంతో కొంత కంగారు పడ్డారు. అతడు ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో చూసి మరీ పీలగా ఉండడంతో రకరకాల సందేహాలు వ్యక్తం చేశారు అభిమానులు. ఆరోగ్య సమస్య తీవ్రమైనదేనని కంగారు పడ్డారు. అయితే అన్నిటికీ చెక్ పెడుతూ .. అసలు తన ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదని తాను బావున్నానని రానా సందేశం ఇచ్చాడు. సమస్య ఏదీ లేదని రానా పదే పదే చెబుతూనే ఉన్నారు. ఇంతకీ అతడు ఎలా ఉన్నాడు? అన్నదానికి ఇదిగో ఇదే ప్రూఫ్.రానా నిన్ననే హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. అతడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్నప్పటి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో రానా లుక్ షాకింగ్ గానే ఉంది. అతడు పూర్తిగా సన్నగా కనిపిస్తున్నాడు. భళ్లాలదేవ రూపం మాయమైంది. అయితే ఇంకో రకంగా చెప్పాలంటే అతడు లీడర్ సినిమాతో డెబ్యూ కథానాయకుడిగా బరిలో దిగినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉన్నాడు. అప్పటికి కాలేజ్ లైఫ్ ముగించి బరిలో దిగాడు కదా.. ఆ రూపమే కనిపిస్తోంది.

సన్నగా ఉండడం అన్నదేమీ పెద్ద సమస్య కాదు. అతడు తిరిగి మ్యాకో మ్యాన్ గా మారడం కష్టమేమీ కాదు. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా పూర్తిగా క్యూర్ అవ్వడం ఇంపార్టెంట్. తన మారిన రూపానికి సంబంధించి రానా స్వయంగా మీడియాకి వివరణ ఇస్తాడేమో చూడాలి. భవిష్యత్ ప్రాజెక్టులపైనా ఓ క్లారిటీ ఇస్తే బావుంటుందని అభిమానులు భావిస్తున్నారు.