రానా వెర్సస్ సంపత్ వెర్సస్ కామెడీ హీరోస్

Fri Aug 10 2018 07:00:26 GMT+0530 (IST)

ఆగస్టు నెలలో ఇక బెర్తులేమీ ఖాళీ లేవు. ప్రతి వారం రెండుకు తక్కువ కాకుండా సినిమాలు రిలీజవుతున్నాయి. దీంతో ఇక సెప్టెంబరు మీద దృష్టిపెట్టారు దర్శక నిర్మాతలు. సెప్టెంబరులో సైతం వినాయకచవితికి ఆల్రెడీ ‘నన్ను దోచుకుందువటే’.. ‘యు టర్న్’ షెడ్యూల్ అయిపోయాయి. దానికి ముందు వారం ఖాళీగా ఉంటే.. ఒక్క రోజు వ్యవధిలో ఆ వీకెండ్ కోసం మూడు సినిమాలు రేసులోకి వచ్చేయడం విశేషం.ఫ్లాపుల్లో పడి కొట్టు మిట్టాడుతున్న కామెడీ హీరోలు అల్లరి నరేష్.. సునీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సిల్లీ ఫెలోస్’ సెప్టెంబరు 7న విడుదలవుతుందని దర్శక నిర్మాత భీమనేని శ్రీనివాసరావు ప్రకటించాడు. ఈ చిత్రం ఈ ముగ్గురికీ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోవైపు దర్శకుడిగా వరుస ఫెయిల్యూర్లతో ఇబ్బంది పడుతున్న సంపత్ నంది.. రచయితగా.. నిర్మాతగా చేసిన ప్రయత్నం ‘పేపర్ బాయ్’. జయశంకర్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించగా.. సంతోష్ శోభన్.. రియా సుమన్ జంటగా నటించారు. దీని టీజర్ ఆకట్టుకుంది. త్వరలోనే ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. ఇది కూడా సెప్టెంబరు 7నే వస్తుంది.

మరోవైపు సెప్టెంబరు 7నే ఓ ఆసక్తికర చిత్రం రాబోతోంది. అదే.. కేరాఫ్ కంచెర పాలెం. వెంకటేష్ మహా అనే కొత్త దర్శకుడు అందరూ కొత్త వాళ్లతో చేసిన విభిన్న ప్రయత్నమిది. దీని గురించి టాలీవుడ్ సర్కిల్స్ లో గొప్పగా చెప్పుకుంటున్నారు. టాలీవుడ్లో ఇదొక ట్రెండ్ సెట్టర్ అవుతుందని అంటున్నారు. ఈ చిన్న సినిమాకు దగ్గుబాటి రానా అండగా నిలవడం విశేషం. అతనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాడు. తనే ముందుండి ప్రమోట్ చేయాలని కూడా డిసైడయ్యాడు. మరి ఈ మూడు చిత్రాల్లో ప్రేక్షకుల్ని ఏవి ఏమేరకు మెప్పిస్తాయో చూడాలి.