Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ లో లాకైపోయిన వెట‌ర‌న్ న‌టి

By:  Tupaki Desk   |   17 Jun 2020 11:30 PM GMT
లాక్ డౌన్ లో లాకైపోయిన వెట‌ర‌న్ న‌టి
X
తెలుగు త‌మిళంలో లేడీ సూప‌ర్ స్టార్ గా ఎదురేలేని స్థానంలో ఉన్నారు ర‌మ్య‌కృష్ణ‌. బాహుబ‌లి శివ‌గామిగా త‌న రేంజు స్కైలో ఉంది. రాజ‌మాత శివ‌గామి పాత్ర‌కు ద‌క్కిన పాపులారిటీతో వ‌రుస‌గా డ‌జ‌ను పైగానే సినిమాల్లో న‌టించేసింది. ప్ర‌స్తుతం శివ‌గామి రోల్ కొన‌సాగింపు పాత్ర‌తో తీస్తున్న ఓ బ‌హుభాషా చిత్రంలోనూ న‌టిస్తోంది.

అలాగే దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న ఫైట‌ర్ లో ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా 50శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఇది బాహుబ‌లి రేంజ్ పాన్ ఇండియా సినిమా అని ర‌మ్య‌కృష్ణ చెబుతున్నారు. దీంతో పాటే భ‌ర్త‌ కృష్ణ వంశీ తెర‌కెక్కిస్తున్న రంగ మార్తాండ‌లో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. లాక్ డౌన్ వ‌ల్ల వెయిటింగ్. నెక్ట్స్ షూటింగుల‌కు వెళ్ల‌నున్నారు.

మ‌రోవైపు హిందీ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్నారు. బిగ్ బి అమితాబ్ తో తెర‌కెక్కించ‌నున్న హిందీ-త‌మిళ్ ద్విభాషా చిత్రంలోనూ ర‌మ్య‌కృష్ణ న‌టించ‌నున్నారు. మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఈ మూవీపై క్లారిటీ మిస్స‌య్యింద‌ని త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు తెలుస్తాయ‌ని ర‌మ్య‌కృష్ణ వెల్ల‌డించారు. ఇక ఇంత‌కుముందే బాలీవుడ్ తో ర‌మ్య‌కు ప‌రిచ‌యం ఉంది. ఖల్ నాయక్ - క్రిమినల్ -షాపాత్ -బడే మియాన్ చోటే మియాన్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. అయితే కొన్ని ఆశించిన చిత్రాలు పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో హిందీ ప‌రిశ్ర‌మ‌ను విడిచిపెట్టి సౌత్ లో బిజీ అయ్యాన‌ని ర‌మ్య‌కృష్ణ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

త‌న కెరీర్ బెస్ట్ రోల్ గా శివ‌గామి త‌న‌కు పాపులారిటీ తెచ్చింద‌ని ర‌మ్య‌కృష్ణ ప్ర‌త్యేకించి వెల్ల‌డించారు. ప్ర‌స్తుత స్వీయ‌నిర్భంధ స‌మ‌యంలో ఇంట్లో స‌మ‌యం ఎక్కువ గ‌డిపాన‌ని తెలిపిన ర‌మ్య‌కృష్ణ వంట చేసేందుకు ప్ర‌య‌త్నించాన‌ని తెలిపారు. కుటుంబంతో ఇంత‌కుముందు ఇలా గ‌డిపేందుకు ఆస్కారం లేక‌పోయింద‌ని ఈ కాలాన్ని కుటుంబంతో ఆస్వాధించాన‌ని తెలిపారు. ఇటీవ‌ల ర‌మ్య‌కృష్ణ కార్ లో మ‌ద్యం అంటూ మీడియా హడావుడి చేసిన సంగతి తెలిసిందే. చెన్న‌య్ లో స‌ద‌రు వెట‌ర‌న్ న‌టి ప్రయాణిస్తున్న కార్ లో వీటిని క‌నుగొన్నారు.