కేవలం ఓటీటీ కోసమే బాలీవుడ్ సినిమాలు.. సంచలన దర్శకుడి షాకింగ్ కామెంట్స్..!

Fri May 13 2022 17:07:41 GMT+0530 (IST)

Ramgopal Varma Comments On Bollywood

ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేస్తున్న సంగతి తెలిసిందే. 'పుష్ప' 'RRR' 'కేజీయఫ్-2' వంటి సౌత్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టిస్తుంటే.. హిందీ చిత్రాలు మాత్రం కనీస ఓపెనింగ్స్ తెచ్చుకోడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందీ భాష వివాదం తెరపైకి రావడంతో.. ఈ వ్యవహరమంతా బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండస్ట్రీ అనే విధంగా మారింది.ప్రస్తుతం బాలీవుడ్ పై సౌత్ సినిమా డామినేషన్ నడుస్తున్న నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో బీ టౌన్ ప్రముఖులకు చురకలు అంటిస్తూ వస్తున్నారు. తాజాగా హిందీ చిత్ర పరిశ్రమ పై మరోసారి కౌంటర్ వేశారు. ''సౌత్ చిత్రాలు థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. నార్త్ సినిమాలు అక్కడి దాకా వెళ్లలేకపోయారు. ఇదంతా చూస్తుంటే త్వరలోనే బాలీవుడ్ కేవలం ఓటీటీ కోసమే సినిమాలు తెరకెక్కించే పరిస్థితి వచ్చేలా ఉంది'' అని ఆర్జీవీ పేర్కొన్నారు.

ఇటీవల మహేష్ బాబు బాలీవుడ్ ఇండస్ట్రీ తనను భరించలేదంటూ చేసిన వ్యాఖ్యలను ఉటంఘించిన వర్మ.. హిందీ ఇండస్ట్రీపై వ్యంగ్యంగా స్పందించిన విషయం తెలిసిందే. ఉత్తరాది స్టార్స్ అభద్రతాభావంతో ఉన్నారని.. దక్షిణాది స్టార్స్ పట్ల అసూయతో ఉన్నారనేది కాదనలేని నిజమని ఆ మధ్య వర్మ ట్వీట్ చేశారు.

ప్రభాస్ - యష్ - రామ్ చరణ్ - ఎన్టీఆర్ - అల్లు అర్జున్ బాలీవుడ్ కి వెళ్లి హిందీ స్టార్స్ రణవీర్ సింగ్ - రణబీర్ కపూర్ - అక్షయ్ కుమార్ - అజయ్ దేవగన్ - జాన్ అబ్రహం మొదలైన వారిని బ్లాస్ట్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ అందరూ తమ హిందీ చిత్రాలను తెలుగు కన్నడ మొదలైన భాషల్లోకి డబ్ చేసి.. అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేసి సౌత్ స్టార్స్ కి సవాల్ విసరాలి అని ఆర్జీవీ వ్యగ్యంగా స్పందించారు.

ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ తనపై తాను ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకున్నారు. తాను ఎప్పుడూ ఒకేలా ఉండనని.. తన ప్రతి సినిమా సమయంలో చనిపోయి మళ్లీ పుడతానని అన్నారు. తాను మెదడులోని ఆలోచనల్నే కథలుగా మలుస్తానని.. దేశ పౌరుడిగా రాజ్యాంగంలో తనకున్న హక్కులేమిటో తెలుసని.. వాటిని వాడుకుంటున్నానని తెలిపారు. ఎదుటి వాళ్లు బాధపడతారని మాట్లాడకుండా ఉంటే అసలు ఏం మాట్లాడలేమని ఆర్జీవీ అన్నారు.

భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అనే దానికి సమాధానం చెబుతూ.. ఒకవేళ నేను ఎన్నికల్లో నిలబడితే బుద్ది ఉన్నవాళ్ళు ఎవరూ నాకు ఓటెయ్యరని చెప్పారు. ఎందుకంటే తాను జనాలకు ఏం చేయననే విషయం వారికి బాగా తెలుసని.. తన కోసం తాను బతుకుతానని.. రాజకీయ నాయకుల లక్షణం అది కాదని ఆర్జీవీ పేర్కొన్నారు.

తనలాగా బతకాలంటే మూడు విషయాలను అలవరుచుకోవాలని.. దేవుడు - సమాజం - కుటుంబం వంటి మూడు అంశాలను వదిలేయాలని వర్మ అన్నారు. అప్పుడు వచ్చే స్వేచ్ఛతో తన లాగా బతకవచ్చని వ్యాఖ్యానించాడు. ఎవరైనా తన మీదకు చంపడానికి వస్తే పారిపోనని.. వచ్చిన వ్యక్తి కత్తితో పొడిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆస్వాదించి చచ్చిపోతానంటూ వర్మ తనదైన శైలిలో బదులిచ్చారు.