Begin typing your search above and press return to search.

#RC15 అఫిషియల్: చరణ్ కు జోడీగా కియారా ఫిక్స్..!

By:  Tupaki Desk   |   31 July 2021 6:06 AM GMT
#RC15 అఫిషియల్: చరణ్ కు జోడీగా కియారా ఫిక్స్..!
X
స్టార్ డైరెక్టర్ శంకర్ - మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌ లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చరణ్‌ కెరీర్ లో 15వ ప్రాజెక్ట్‌ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం స్టార్ క్యాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ ని ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ఇందులో హీరోయిన్‌ ఎవరు అనే విషయంలో ఎన్నో ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. చెర్రీ కి జోడీ అంటూ ఎంతోమంది స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర బృందం ఈరోజు శనివారం హీరోయిన్ ని అధికారికంగా ప్రకటించారు.

'#RC15' చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించనుందని మేకర్స్ వెల్లడించారు. ఈరోజు కియరా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. నిర్మాణ సంస్థ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ లోకి ఆమెకు స్వాగతం పలికింది. శంకర్ - కియరా ఇద్దరూ చర్చించుకుంటున్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా "ఇది ఖచ్చితంగా నేను ఇప్పటివరకు పొందిన బెస్ట్ బర్త్ డే బహుమతులలో ఒకటి. సినీ ఇండస్ట్రీలోని ప్రఖ్యాత మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులతో కలసి పనిచేయడానికి నేను సంతోషిస్తున్నాను" అని కియరా పేర్కొన్నారు.

కాగా, రామ్ చరణ్ తో కలిసి ఇంతకముందు 'వినయ విధేయ రామా' చిత్రంలో కియరా అద్వానీ ఆడిపాడింది. ఈ క్రమంలో ఇప్పుడు RC15 కోసం మరోసారి జోడీ కట్టనున్నారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చనున్నారు. ప్ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్ సంభాషణలు రాస్తున్నారు. శంకర్ - చరణ్ కాంబోలో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో పట్టాలెక్కించనున్నారని సమాచారం.