టీజర్ టాక్ : అహంకారి అయిన రాముడి కథా?

Sun Apr 14 2019 09:43:00 GMT+0530 (IST)

Rama Chakkani Seetha Movie Teaser

రామాయణం ఆధారంగా ఎన్నో క్లాసిక్ సినిమాలు టాలీవుడ్ లో రిలీజై ఘనవిజయం సాధించాయి. స్వయంవరంలో శివధనస్సును విరిచి సామర్థ్యాన్ని నిరూపించుకుని సీతను దక్కించుకున్న రాముని కథతో తెలుగులో సినిమాలొచ్చాయి. ఇదే రామాయణం కథ స్ఫూర్తితో నిజఘటనల ఆధారంగా `రామ చక్కని సీత` చిత్రాన్ని తెరకెక్కించామని చెబుతోంది ఈ టీమ్. ఇంద్ర సుకృత వాగ్లే నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రంలో ప్రియదర్శి ముఖ్య పాత్ర పోషించారు. శ్రీహర్ష మంద దర్శకత్వం వహించారు.  లియో సెల్యూలాయిడ్స్.. క్రొకడైల్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.``అహంకారం.... ఆత్మ గౌరవం.. స్థాయి.. కీర్తి.. ఇవన్నీ పక్కన పెట్టి ఒక ఆడదానికోసం స్వయంవరానికి వెళ్లి శివధనస్పు విరిచి నా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలా? అని ఆ రాముడు అనుకుని ఉంటే రామాయణం వేరేలా జరిగి ఉండేది. ఒకవేళ అదే జరిగి ఉంటే ఆ రామాయణం కూడా యథాతథంగా నా కథలా ఉంటుంది..`` అంటూ భారీ డైలాగ్ తో టీజర్ ని లీడ్ చేశారు. అయితే స్వయంవరంలో సామర్థ్యం నిరూపించుకునేందుకు వెళ్లని రాముని కథను తెరపై చూపిస్తున్నారా? అన్నది ఓ కన్ఫ్యూజన్. అహంకారి అయిన రాముని కథా ఇది? అమ్మాయి కోసం కోరి తంటాలు తెచ్చుకునే వాడి కథా?.. టీజర్ లో కథానాయకుడు ఇంద్ర లుక్ .. యాక్షన్ మోడ్ ఆకట్టుకుంది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనవసరమైన అరుపులతో ఇర్రిటేషన్ పుట్టించడం డ్రాబ్యాక్. టైటిల్ ఆకర్షణీయంగా ఉంది. అందుకు తగ్గ డీసెన్సీ అన్నిట్లో కనిపించాలి. ప్రియదర్శి లాంటి ట్యాలెంటెడ్ కమెడియన్ ఈ సినిమాకి ప్లస్ అవుతాడనడంలో సందేహం లేదు.

యాక్షన్ .. లవ్ స్టోరి బ్లెండ్ చేసి తెరకెక్కించిన సినిమా ఇదని టీజర్ చెబుతోంది. టైటిల్ ఆకట్టుకుంది. టీజర్ లో కొన్ని షాట్స్ అమేజింగ్ అనిపించాయి. అయితే అంత విషయం సినిమా ఆద్యంతం ఉంటుందా? స‌్క్రీన్ ప్లేని అంతే గ్రిప్పింగ్ గా నడిపించారా? అన్నదే ఇంపార్టెంట్. పరిమిత బడ్జెట్ చిత్రాలు చాలా అరుదుగా మాత్రమే సక్సెస్ అందుకుంటున్నాయి. ఈ ఏడాది 100రోజుల్లో 50 సినిమాలు రిలీజైతే సక్సెస్ రేటు 1శాతంగా ఉందని ఓ చిన్న నిర్మాత వాపోయాడంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ ఇమేజ్ లేని సినిమాలు గ్రిప్పింగ్ నేరేషన్ తో మెప్పిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆ కోవకు ఈ సినిమా చెందుతుందా లేదా? అన్నది తెరపై చూసి చెప్పాల్సిందే. ఫణికాంత్ - వరలక్ష్మి మందా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేశవ కిరణ్ సంగీతం అందిస్తున్నారు.