రామ్ ఈసారి మిస్ అయ్యాడంటే ఆ ఆశలన్నీ గల్లంతే!

Tue Aug 16 2022 17:00:01 GMT+0530 (IST)

Ram Pothineni Upcoming Films

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `అఖండ` వంటి భారీ బ్లాక్ బస్టర్ అనంతరం బోయపాటి చేస్తున్న చిత్రమిది. రామ్ కి ఇది 20వ ప్రాజెక్ట్ అయితే.. బోయపాటికి 10వ సినిమా కావడం విశేషం. అలాగే ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్9గా శ్రీనివాసా చిట్టూరి హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంపై రామ్ భారీ ఆశలు పెట్టుకున్నాడట. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని ఆరాటపడుతున్నాడట. వాస్తవానికి టైర్-2 హీరోల లిస్ట్ లో ఉన్న రామ్.. `ది వారియర్` మూవీతో స్టార్ హీరోల చెంత చేరాలని భావించాడు.

తమిళ దర్శకుడు ఎన్.లింగుసామి తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తే.. ఆది పినిశెట్టి విలన్ గా చేశాడు. జూలై 14న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. పైగా లాంగ్ రన్ ముగిసే సరికి ఈ మూవీ వల్ల బయ్యర్లకు రూ. 15 కోట్ల రేంజ్ లో నష్టాలు వచ్చాయని టాక్.

ఇక ఈ ద్విభాష చిత్రంతో తన మార్కెట్ డబుల్ అవుతుందని టాలీవుడ్ స్టార్ హీరోల చెంత చేరొచ్చని రామ్ ఆశించాడు. కానీ అవేమి నెరవేరలేదు. దాంతో ఇప్పుడు రామ్ ఆశలన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన `RAP0 20` మీదే పెట్టుకున్నాడట. బోయపాటి శ్రీను సినిమా అంటే మినిమం గ్యారెంటీ. అందులోనూ ఆయన ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే బోయపాటితో చేయబోయే సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని రామ్ నమ్మకంగా ఉన్నడట. ఒకవేళ ఈ మూవీతోనూ హిట్ మిస్ అయ్యాడంటే రామ్ ఆశలన్నీ గల్లంతు అవ్వడమే కాదు.. ఆయన మార్కెట్ సైతం భారీగా దెబ్బ తినే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రామ్ కు బోయపాటి బ్లాక్ బస్టర్ ను అందించి ఆయన కెరీర్ మళ్లీ ఊపందుకునేలా చేస్తాడా..లేదా.. అన్నది చూడాలి.