ఎనర్జిటిక్ స్టార్ తో హరిష్ శంకర్ సినిమా?

Sat May 14 2022 08:00:01 GMT+0530 (IST)

Ram Pothineni Movie With Harish Shankar

ఎనర్జిటిక్ స్టార్ రామ్ - స్టార్ మేకర్ హరిష్ శంకర్ కాంబినేషన్ సెట్ అవుతోందా?  ఇద్దరి కాంబినేషన్ లో అదిరిపోయే మాస్ ఎంటర్ టైనర్ రాబోతుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. ఇద్దరి ఎనర్జీ..క్రేజ్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. రామ్ ఎనర్జీని మ్యాచ్ చేయగల స్ర్కిప్ట్ ని హరిష్ పక్కాగా రెడీ చేయగలడు. రామ్ ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని ఎనర్జీ లెవల్స్ ఏమాత్రం తగ్గకుండా కమర్శియల్ అంశాలతో అదిరిపోయే స్ర్కిప్ట్  సిద్దం చేయడం హరిష్ కి కొట్టిన పిండి.అందులో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల కాలంలో రామ్ కూడా  ఎనర్జీ ఏమాత్రం మిస్ కాని మాస్ డైరెక్టర్లనే వరుస పెట్టి లాక్ చేస్తున్నాడు. `ఇస్మార్ట్ శంకర్` హిట్ తర్వాత `రెడ్` రూపంలో ఓ ప్లాప్ వెక్కిరించింది. దీంతో లాభం లేదనుకున్న రామ్ కోలీవుడ్ యాక్షన్ మేకర్  లింగుస్వామిని రంగంలోకి దించాడు. ప్రస్తుతం అతనితోనే  `ది వారియర్` అనే యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే ఈసినిమా రిలీజ్ కానుంది.

ఈ సినిమా సెట్స్ లో ఉండగానే మరో యాక్షన్ మేకర్ బోయపాటి శ్రీని సీన్ లోకి తెచ్చాడు. అతనితోనూ మరో మాస్ చిత్రం తో సక్సెస్ అందుకోవాలని ఆశపడుతున్నాడు. అదే వేవ్ ని కొనసాగించాలంటే హరిష్ లాంటోడే సరైనోడని అతన్ని ఎంటర్ చేస్తున్నట్లు  తెలుస్తోంది. ఇటీవలే ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.

అన్ని అనుకున్నట్లు జరిగి స్ర్కిప్ట్  లాక్ అయితే గనుక  సినిమా సెట్స్ కి వెళ్లడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం హరీష్ శంకర్ పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  తో `భవదీయుడు భగత్ సింగ్`  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే  రామ్ తో బోయపాటి చిత్రాన్ని   పూర్తి  చేయల్సి ఉంది.

ఈ రెండు ఏడాది చివరికల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. అటుపై రిలీజ్ వచ్చే ఏడాది ఉండొచ్చు. ఆ లెక్కన సినిమా వచ్చే ఏడాది మిడ్ లో ప్రారంభం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ ప్రచారంలో  వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.