Begin typing your search above and press return to search.

ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు

By:  Tupaki Desk   |   5 July 2020 4:27 AM GMT
ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వలన నెలకొన్ని ఉన్న పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మనదేశంలో సంపూర్ణ లాక్ డౌన్ షరతులు సడలించిన తర్వాత కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. రోజురోజుకి కరోనా తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా కరోనా కలకలం రేపుతోంది. ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలకు కూడా కరోనా సోకడంతో అందరూ భయపడిపోతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు టీవీ నటీనటులు మహమ్మారి బారిన పడ్డారు. ఈ క్రమంలో సినీ నిర్మాత పోకూరి రామారావు కరోనా సోకి మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఇండస్ట్రీ జనాలు కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ టీమ్ మెంబర్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని వార్తలు వచ్చాయి.

కాగా గత మూడున్నర నెలలుగా షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయినా వర్మ మాత్రం కరోనా మహమ్మారిని లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వర్మ రెండు సినిమాలను రెడీ చేసి పర్సనల్ ఏటీటీలో వదిలాడు. అయితే ఇప్పుడు ఆర్జీవీ యూనిట్‌ లో పనిచేసే ఒకరికి కరోనా సోకిందని.. దీంతో వర్మ తన సినిమాల షూటింగ్‌ లను రద్దు చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ తన యూనిట్ సభ్యుడికి కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్త పూర్తిగా అవాస్తవమని చెప్పుకొచ్చాడు. ''మా టీమ్ లో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో మేము షూటింగ్స్ ఆపివేసినట్లు వార్తలు ప్రసారం అయ్యాయి.. వాస్తవానికి షూట్ ప్రారంభమయ్యే ముందే ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించాం. అందరికి నెగిటివ్ వచ్చింది. మేము అన్ని గైడ్ లైన్స్ పాటిస్తున్నాము'' అని ట్వీట్ చేసారు. దీంతో ఆర్జీవీ టీమ్ సభ్యుడికి కరోనా అనే వార్తలకు చెక్ పడింది.