కేసీఆర్ బయోపిక్ లు విలన్స్ వాళ్లేనా వర్మా..!

Fri Apr 19 2019 20:00:02 GMT+0530 (IST)

Ram Gopal Varma shows Seemandhra Leaders as Villains in KCR Biopic Tiger Movie

అతడు రామ్ గోపాల్ వర్మ. సంచలనానికి మారు పేరు. వర్మ ఎలాంటి కాన్సెప్ట్ మీద అయినా సినిమా తీసేయగలడు అని రుజువు అయిపోయింది. ఒకప్పుడు సినిమాలు తీసి సంచలనం రేకెత్తించిన వర్మ ఇప్పుడు సంచలనాల మీద మాత్రమే  సినిమాలు తీసేందుకు పరిమితం అయిపోయాడు. ఈ ప్రయత్నంలో వర్మ తన క్రియేటివిటినీ ఎప్పుడో కోల్పోయాడు. వర్మకు ఇక గొప్ప సినిమాలేవో తీయాలి.. అద్భుతాలు ఏవో చేయాలనే తపన కనిపించడం మానేసి చాలా కాలం అయిపోయింది.ఈ క్రమంలో వర్మ నుంచి చాలా చెత్త సినిమాలు వచ్చాయి. ఇక ఇటీవలే వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అంటూ ఒక సినిమాను రూపొందించాడు. ఎన్టీఆర్ కు కుటుంబీకుల వెన్నుపోటు ఉదంతం మీద ఆ సినిమాను వర్మ రూపొందించి సంచలనం రేపాడు. ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతోఆసక్తిగా ఎదురుచూశారు. అయితే వర్మ తను చెప్పాలనుకున్నది చెప్పాడు కానీ అంత ప్రభావవంతంగా - చూడచక్కగా - నాణ్యతతో చూపలేదనే విమర్శలు వచ్చాయి.

అయితే విమర్శలతో వర్మకు పని లేదు. అందుకే ఇప్పుడు కేసీఆర్ బయోపిక్ అనౌన్స్ చేశారు. అందుకు సంబంధించి టైటిల్ లోగోను కూడా వర్మ రిలీజ్ చేసేశాడు. ఈ తీరును చూస్తుంటే.. ఇదీ ఒక నాసికరం సినిమాలానే వర్మ చుట్టేస్తాడనే స్పష్టత వస్తోంది.

మరి ఇంతకీ వర్మ ఈ సినిమాలో ఎవరిని విలన్లుగా చూపుతారు అనేది మరో ప్రశ్న. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ నిర్మొహమాటంగా ఎన్టీఆర్ సంతానాన్ని విలన్లుగా చూపించారు. చంద్రబాబును వెన్నుపోటుదారుగా చూపించారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ లో ఆర్జీవీ కచ్చితంగా సీమాంధ్ర రాజకీయ నేతలను విలన్లుగా చూపే అవకాశం ఉంది.

ఆల్రెడీ వర్మ తన సినిమా గురించి చేసిన ట్వీట్ లోనే ఏపీ ప్రజలు తెలంగాణ వారిని థర్డ్ క్లాస్ సిటిజన్స్ గా చూశారని పేర్కొన్నాడు. దాన్ని బట్టి.. సీమాంధ్ర పాలకులను ఈ సినిమాలో ఆర్జీవీ విలన్లుగా చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అలా చేసినప్పుడే వర్మ సినిమాపై చర్చ జరుగుతుంది. వాదనలు వివాదాలు రేగుతాయి. వర్మకు కావాల్సింది అవే కదా!