వర్మకు చెక్ పెట్టడం సాధ్యమేనా?

Mon Feb 11 2019 22:45:30 GMT+0530 (IST)

Ram Gopal Varma on about Lakshmis NTR movie Promotions

లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి రామ్ గోపాల్ వర్మ ప్రచారాన్ని ఉదృతం చేసాడు. తగ్గించే అవకాశం ఇంచు కూడా కనిపించడం లేదు. షూటింగ్ ముందు లైట్ తీసుకున్న ఈ మూవీ ఎన్నికల సమయంలో హాట్ కేక్ గా మారిపోయేలా ఉంది. ఈ క్రమంలో ఇంతగా ఎన్టీఆర్ రెండో పెళ్ళి నేపథ్యాన్ని తీసుకుని సినిమా పేరుతో వర్మ రచ్చ చేస్తుంటే బాలకృష్ణతో సహా నందమూరి ఫ్యామిలీ మొత్తం ఎందుకు మౌనంగా ఉంది అనే సందేహం అభిమానుల మెదళ్లను తొలిచేస్తోంది. పబ్లిసిటీ పేరుతో ఇంత హంగామా జరుగుతున్నా ఎవరూ పట్టనట్టు ఊరికే ఉన్నారు. మరోపక్క మహానాయకుడు రిలీజ్ కు రెడి అవుతోంది.రెండూ పూర్తి కాంట్రాస్ట్ థీమ్ తో ఒకే వ్యక్తి మీద రూపొందిన సినిమాలు కాబట్టి ప్రేక్షకులు కూడా వీటి మీద ఆసక్తిని పెంచుకున్నారు. దానికి తోడు వర్మ పదే పదే నేను నిజాలే చూపిస్తాను అని చెప్పడంతో బజ్ మెల్లగా పెరుగుతున్న మాట వాస్తవం. ఇది మహానాయకుడికి ఖచ్చితంగా చేటు చేసేదే. అయితే ఫిల్మ్ నగర్ టాక్ మాత్రం కొత్త వెర్షన్ వినిపిస్తోంది.  

దాని ప్రకారం లక్ష్మీస్ ఎన్టీఆర్ కు తాత్కాలిక బ్రేక్ వేయడానికి నందమూరి ఫ్యామిలీకున్న ఒకేఒక్క మార్గం కోర్టు. అయితే వర్మ ఇలాంటి వాటిలో ఆరితేరినవాడు. వ్యవహారం అక్కడిదాకా వస్తే ఎన్టీఆర్ అంటే నందమూరి తారకరామారావు కాదు ఎవరో నెల్లూరు తాండవరావు అంటూ ప్లేట్ ఫిరాయించి క్లియరెన్స్ తెచ్చుకున్నా ఆశ్చర్యం లేదు.

అయితే అలా పేర్లు మార్చినా జనానికి ఇది ఎవరిని ఉద్దేశించి తీసిందో ఈజీగా అర్ధమైపోతుంది. 1988లో పద్మాలయా బ్యానర్ పై ఎన్టీఆర్ విధివిధానాలపై వ్యతిరేకంగా తీసిన సినిమాల్లో విలన్ పేరు ధర్మారావు అనో ఇంకొకటనో ఉంటుంది. సో కోర్టు సెన్సార్ చిక్కులు లేకుండా అవి సాఫీగా విడుదలయ్యాయి. వర్మ కూడా ఇప్పుడు ఇదే స్ట్రాటజీ వాడితే సెన్సార్ కోర్టు రెండూ ఏమి చేయలేవు. వర్మ ధైర్యానికి ఇవే కారణాలుగా కనిపిస్తున్నాయి.

మా నాన్న కథను సినిమాగా తీసే హక్కు నీకెవరు ఇచ్చారు అంటే వర్మ రివర్స్ లో పైన చెప్పిన నెల్లూరు తాండవరావు మీ నాన్ననా అంటూ కౌంటర్ వేస్తాడు. సో తొందరపడితే అది వర్మకే హెల్ప్ అవుతుంది. అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో నందమూరి క్యాంప్ చాలా వ్యూహాత్మకంగా సైలెన్స్ ని పాటిస్తోంది. ఫిబ్రవరి 14న ట్రైలర్ వస్తుంది కాబట్టి అసలు కంటెంట్ మీద ఒక అవగాహన వచ్చే ఛాన్స్ ఉంది. రెండు రోజులేగా. వేచి చూద్దాం