Begin typing your search above and press return to search.

'మర్డర్' కేసుపై వర్మ రియాక్షన్...!

By:  Tupaki Desk   |   5 July 2020 10:02 AM GMT
మర్డర్ కేసుపై వర్మ రియాక్షన్...!
X
కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ వాస్తవ సంఘటల ఆధారంగా సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడనే విషయం అందరికి తెలిసిందే. సినీ రాజకీయ ప్రముఖుల లైఫ్ ఇన్సిడెంట్ స్ అయినా.. శృంగార తరాల లైఫ్ హిస్టరీ అయినా.. ఎన్ కౌంటర్ చేయబడిన వ్యక్తుల జీవితాలైనా.. గ్యాంగ్ స్టర్ జీవిత కథ అయినా వర్మకి కథా వస్తువులే. ఈ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే క్రమంలో ఎన్ని వివాదాలు చెలరేగినా అడ్డంకులు వచ్చినా కేర్ చేయకుండా తాను అనుకున్నది సినిమాగా మలిచేస్తాడు. ఈ క్రమంలో ఇటీవల 'మర్డర్' 'పవర్ స్టార్' అనే రెండు కాంట్రవర్సీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసారు వర్మ. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యోదంతం నేపథ్యంలో అమృత - ప్రణయ్ - మారుతీరావుల విషాద గాద ఆధారంగా 'మర్డర్' సినిమా ఉండబోతోందని.. ఇది 'కుటుంబ కథా చిత్రమ్‌' అని పేర్కొన్నారు.

కాగా మిర్యాలగూడకు చెందిన కూతురు అమృత.. ప్రణయ్‌ అనే వ్యక్తిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకోవడం వల్ల తన పరువు పోయిందని అల్లుడిని దారుణంగా హత్య చేయించాడు. అయితే ఇటీవల మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఇప్పుడు ఈ ఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నానని కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడంతో అందరి దృష్టి 'మర్డర్' పై పడింది. అయితే ఈ మూవీపై ప్రణయ్ తండ్రి బాలస్వామి మిర్యాలగూడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. 'మర్డర్' సినిమా కోసం ప్రణయ్‌ అమృత ఫొటోలను వాడారని పిటిషనల్ పేర్కొన్నారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు మిర్యాలగూడ పోలీసు స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ ఇష్యూపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''నా చిత్రం 'మర్డర్' పై దాఖలైన కేసుపై మీడియాలో వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో మరోసారి చెబుతున్నా. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది తప్ప వాస్తవం కాదు. అదేవిధంగా ఏ ఒక్క కుల ప్రస్తావన ఈ సినిమాలో తీసుకురాలేదు'' అని తెలిపారు.

అంతేకాకుండా ''తెలియని ఊహాగానాల ఆధారంగా దాఖలైన కేసుకు సంబంధించి మా అడ్వకేట్స్ చట్టం ప్రకారం తగిన సమాధానం ఇస్తారు'' అని మరో ట్వీట్ చేశారు. ''నేను ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదని నేను స్పెషల్ గా మెన్షన్ చేశాను. నా చిత్రం ప్రజాక్షేత్రంలో ఉన్న ఒక అంశంపై ఆధారపడిన సృజనాత్మక రచన మాత్రమే.. అయితే చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను కూడా నా ప్రాథమిక హక్కులను రక్షించుకోడానికి చట్టబద్ధంగా ముందుకు వెళ్తాను'' అని చెప్పుకొచ్చాడు. కాగా ఆనంద్ చంద్ర ఈ 'మర్డర్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు క్విటీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రధాన పాత్రలైన మారుతీరావుగా శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తుండగా అమృత పాత్రలో సాహితి నటిస్తోంది.