Begin typing your search above and press return to search.

కరోనా సోకిందని మర్డర్ కేసు విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ...!

By:  Tupaki Desk   |   11 Aug 2020 12:55 PM GMT
కరోనా సోకిందని మర్డర్ కేసు విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ...!
X
రామ్ గోపాల్ వర్మ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో 'మర్డర్' అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. యావత్ భారతదేశానికి షాక్ ఇచ్చిన ఒక ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమని వర్మ చెప్తున్నా.. మిర్యాలగూడ అమృత - ప్రణయ్‌ - మారుతీరావు ఉదంతం మీద ఆర్జీవీ ఈ సినిమా తీసాడని అందరికి తెలుసు. ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించగా.. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు క్విటీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించారు. అయితే తన అనుమతి లేకుండా తన జీవిత కథపై రామ్ గోపాల్ వర్మ ''మర్డర్'' అనే సినిమా తీస్తున్నారని.. తనకు ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రణయ్ భార్య అమృత నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిన కోర్టు ఆగస్టు 11 లోగా నిర్మాతలు కౌంటర్ దాఖలు చేయాలని.. విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల చేయొద్దని ఆదేశించింది. అయితే నిర్మాతలు కానీ.. రామ్ గోపాల్ వర్మ కానీ కౌంటర్ దాఖలు చేయలేదు.

కాగా నేడు విచారణకు రామ్ గోపాల్ వర్మ నల్గొండ జిల్లా కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని కోర్టు వర్మ తరపు న్యాయవాదిని కోరగా.. తన క్లయింట్ కు కరోనా సోకిందని.. అందువల్ల పిటిషన్‌ కు సమాధానం ఇవ్వలేకపోతున్నామని కోర్టుకు తెలిపారు. దీంతో అమృత వేసిన పిటిషన్ విచారణను ఈ నెల 14కి కోర్టు వాయిదా వేసింది. అయితే ఇటీవల రామ్ గోపాల్ వర్మకు కరోనా వైరస్ సోకిందని.. జ్వరంతో బాధపడుతున్నారని వచ్చిన వార్తలను ఖండిస్తూ ఓ వీడియో వదిలారు వర్మ. చేతిలో డంబెల్ పట్టుకుని వర్కౌట్స్ చేస్తూ తాను చాలా ఆరోగ్యంగా ఫిట్‌ గా ఉన్నానని.. రెస్ట్ లేకుండా సినిమాలు తీస్తున్నానంటూ పేర్కొన్నాడు. కానీ ఆర్జీవీ లాయర్ మాత్రం వర్మకు కరోనా వైరస్ సోకిందని.. అందుకే విచారణకు హాజరుకాలేకపోయారని నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టుకు తెలిపారు. అయితే రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా దీనికి ఖండిస్తూ ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి దీనికి క్లారిటీ ఇస్తానని ట్వీట్ చేసాడు..