Begin typing your search above and press return to search.

చిరు-చ‌ర‌ణ్ సినిమా అదేనా?

By:  Tupaki Desk   |   8 Oct 2019 1:30 AM GMT
చిరు-చ‌ర‌ణ్ సినిమా అదేనా?
X
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి మ‌గ‌ధీర సినిమాలో ఒక ఐదు నిమిషాలు క‌నిపిస్తేనే థియేట‌ర్లు హోరెత్తిపోయాయి. మెగా అభిమానులు ప‌ర‌వశంలో మునిగిపోయారు. ఇప్పుడు వీళ్లిద్ద‌రూ క‌లిసి ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తార‌న్న వార్త‌లొస్తున్నాయి. ఈసారి చిరు సినిమాలో చ‌ర‌ణ్ అతిథి పాత్ర చేస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఉత్తుత్తి ప్ర‌చారం కాద‌ని.. నిజంగానే వీళ్లిద్ద‌రూ క‌లిసి న‌టించ‌బోతున్నార‌ని రూఢి అయింది. స్వ‌యంగా చిరంజీవే ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించాడు. సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా తాజాగా నిర్వ‌హించిన ప్రెస్ మీట్లో చిరు ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. తాను, చ‌ర‌ణ్ క‌లిసి న‌టించే సినిమా గురించి త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని చిరు చెప్ప‌డంతో మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేక‌పోయాయి.

అయితే చిరు-చ‌ర‌ణ్ క‌లిసి న‌టించే సినిమా మ‌ల‌యాళ హిట్ మూవీ లూసిఫర్‌కు రీమేక్ అయ్యుండొచ్చేమో అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. సైరా మ‌ల‌యాళ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్ కోసం చిరు కేర‌ళ‌కు వెళ్లిన‌పుడు.. ఆ వేడుక‌కు వ‌చ్చిన పృథ్వీరాజ్, చిరు లూసిఫ‌ర్ రీమేక్ హ‌క్కులు కొన్న‌ట్లు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప‌ట్టాలెక్కొచ్చ‌ని తెలుస్తోంది. మ‌ల‌యాళంలో ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే కాక ఓ కీల‌క పాత్ర చేశాడు పృథ్వీరాజ్. ఆ పాత్ర‌లోనే చ‌ర‌ణ్ క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. ఈ ప్రాజెక్టు గురించే త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న రావ‌చ్చ‌ని భావిస్తున్నారు. రీఎంట్రీలో చిరుతో వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తున్న రామ్ చ‌ర‌ణ్‌.. ఈ చిత్రాన్ని కూడా త‌నే ప్రొడ్యూస్ చేసే అవ‌కాశ‌ముంది. కొర‌టాల శివ చిత్రం త‌ర్వాత‌, త్రివిక్ర‌మ్ సినిమాకు ముందు చిరు ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశ‌ముంది.