ఎన్టీఆర్ గేమ్ షో లో రూ.25 లక్షలు గెలుచుకున్న రామ్ చరణ్..?

Thu Jul 29 2021 14:30:26 GMT+0530 (IST)

Ram Charan wins Rs 25 lakh in NTR game show

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ''ఎవరు మీలో కోటీశ్వరుడు'' గేమ్ షో ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' గేమ్ షో తరహాలోనే ఈ ప్రోగ్రామ్ ఉండబోతోంది. ఇందులో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన కంటెస్టెంట్ కి కోటి రూపాయలు ఇవ్వనున్నారు. సమాధానం తెలుసుకోడానికి కొన్ని లైఫ్ లైన్లు కూడా ఉపయోగించుకోవచ్చు.ఇకపోతే ఫస్ట్ ఎపిసోడ్ కు 'RRR' సహనటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరవుతారని.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెమినీ టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కార్యక్రమం ప్రారంభం కానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆల్రెడీ 16 ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారట. అంతేకాదు 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ తో ఓ స్పెషల్ ఎపిసోడ్ ని కూడా షూట్ చేసినట్లు టాక్ నడుస్తోంది.

ఈ ప్రోగ్రామ్ లో ఎన్టీఆర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన చరణ్.. రూ. 25 లక్షల రూపాయలు గెలుచుకున్నాడట. ఇదే కనుక నిజమైతే మరో రెండు ప్రశ్నలకు మెగా హీరో జవాబులు చెప్పి ఉండే కోటి గెలుచుకునే వాడు. ఎందుకంటే 'ఎవరు మీలో కోటీశ్వరుడు' క్విజ్ షో లో ప్రతీ సమాధానానికి ప్రైజ్ మనీ రెట్టింపు అవుతుంది. రామ్ చరణ్ తో షూట్ చేసిన ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ఆగస్టు 16న టెలికాస్ట్ చేయనున్నారట. ఆ తర్వాత సాధారణ కంటెస్టెంట్స్ పాల్గొన్న ఎపిసోడ్స్ ను ప్రసారం చేయనున్నారు. మధ్యలో స్పెషల్ గెస్ట్స్ ని కూడా పిలవనున్నారు.

'ఎవరు మీలో కోటీశ్వరుడు' షో కోసం 60 ఎపిసోడ్లకు గానూ జూనియర్ ఎన్టీఆర్ రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 16 ఎపిసోడ్స్ పూర్తి కాగా.. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకు సంబంధించిన పెండింగ్ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మిగతా ఎపిసోడ్స్ ని చిత్రీకరణ చేయనున్నారు. తారక్ ఇంతకముందు 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో కు హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి టెలివిజన్ స్క్రీన్ పై సందడి చేస్తుండటంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతా రామరాజు పాత్రలో చరణ్.. కొమురం భీమ్ గా తారక్ నటిస్తున్నారు. ఒక సాంగ్ మినహా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయింది. దసరా సందర్భంగా అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల చేయనున్నారు. దీని తర్వాత 'జనతా గ్యారేజ్' ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా మొదలు పెట్టనునమ్న్నాడు. ఆ తర్వాత 'కేజీయఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఓ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసాడు. మరోవైపు చరణ్ ఇప్పటికే కొరటాల తో 'ఆచార్య' చిత్రాన్ని కంప్లీట్ చేశాడు. మరికొన్ని రోజుల్లో శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ కి చరణ్ శ్రీకారం చుట్టనున్నారు.