చరణ్ కి ఎట్టకేలకు దానికి టైమ్ దొరికిందట!

Thu Aug 11 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Shankar will now resume pre-production work and shooting for Indian 2

రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయినప్పటి నుండి శంకర్ సినిమా షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నాడు. వరుస షెడ్యూల్స్ తో చరణ్ కి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా శంకర్ షూటింగ్ పెట్టుకుంటూ వచ్చాడు.తాజాగా రామ్ చరణ్ మరియు శంకర్ సినిమా కు చిన్న బ్రేక్ వచ్చిందని.. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 పనిలో పడ్డాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇండియన్ 2 సినిమా యొక్క నిర్మాతలతో జరిగిన ఒప్పందం మేరకు ఆ సినిమా కోసం శంకర్ రెండున్నర నుండి మూడు నెలల పాటు సమయం కేటాయించాల్సి ఉంది. ఆ సమయంలో బ్యాలెన్స్ షూటింగ్ ను ముగించి వెంటనే విడుదలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇప్పుడు శంకర్ అదే పనిలో ఉన్నాడు అంటూ తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రామ్ చరణ్ తో వరుసగా షెడ్యూల్ ల్లో షూటింగ్ చేసిన శంకర్ ఇప్పుడు ఇండియన్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు షూటింగ్ పునః ప్రారంభించే పనిలో ఉండటం వల్ల రామ్ చరణ్ కి కావాల్సినంత సమయం లభించినట్లు అయ్యింది. ఈ ఖాళీ టైమ్ ను రామ్ చరణ్ సద్వినియోగం చేసుకునేందుకు తన తదుపరి సినిమా స్క్రిప్ట్ వర్క్ లో పడ్డాడట.

ఇప్పటికే రామ్ చరణ్ తదుపరి సినిమా కు జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించబోతున్నాడని.. ఆయన స్టోరీ లైన్ చెప్పగా ఓకే చెప్పాడని.. ఇప్పుడు స్క్రిప్ట్ ను పూర్తి చేసేందుకు గాను చరణ్ తో గౌతమ్ సిట్టింగ్స్ వేస్తున్నాడని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రామ్ చరణ్ కేవలం గౌతమ్ తిన్ననూరితో మాత్రమే కాకుండా మరి కొందరు నిర్మాతలు మరియు దర్శకులతో కూడా ఈ గ్యాప్ లో భేటీ అవ్వబోతున్నాడు. కొత్త సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ చర్చలు.. ఇతర చర్చలను కూడా ఆయన జరుపబోతున్నట్లుగా తెలుస్తోంది.