Begin typing your search above and press return to search.

`రంగ‌స్థలం` రేంజులో చెర్రీ రోల్

By:  Tupaki Desk   |   16 Feb 2020 11:30 PM GMT
`రంగ‌స్థలం` రేంజులో చెర్రీ రోల్
X
చ‌ర‌ణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఏదీ? అని ప్ర‌శ్నిస్తే `రంగ‌స్థ‌లం` చిట్టిబాబుగా అత‌డి న‌ట‌న‌ను గుర్తు చేసుకుంటారు అభిమానులు. చెవిటి వాడిగా .. అమాయక ప్రేమికుడిగా చిట్టి బాబు న‌ట‌న క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. ఇక చిట్టి బాబులో ఎమోష‌న్ అయితే గుండె పిండేస్తుంది. మ‌ళ్లీ అలాంటి రోల్ లో అవ‌కాశం ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని ఫ్యాన్స్ భావిస్తుంటారు.

అయితే చెర్రీకి అలాంటి అవ‌కాశం కొర‌టాల సినిమా రూపంలో దొరికేసింద‌నే చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 152వ చిత్రంలో చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నాడు. ఈ పాత్ర‌లో ఇంటెన్సిటీ రంగ‌స్థ‌లం చిట్టిబాబుకు ఏమాత్రం త‌గ్గ‌ద‌ట‌. తండ్రి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో చ‌ర‌ణ్ నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడని ఓ లీక్ అందింది. త్వరలో రాజమండ్రిలో షూట్ కి హాజ‌ర‌వుతాడ‌న్న గుస‌గుసా వేడెక్కిస్తోంది. ఈ చిత్రంలో యువ చిరంజీవిగా చెర్రీ నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే చిరు స‌ర‌స‌న త్రిష‌ను ఖాయం చేశారు కాబ‌ట్టి చెర్రీకి నాయిక‌ను ఫైన‌ల్ చేయాల్సి ఉందిట‌.

ఈ సినిమాకి ఆచార్య అనే టైటిల్ వినిపిస్తోంది. రామ్ చరణ్ తో క‌లిసి మాట్నీ ఎంటర్ టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవాల‌య భూముల కుంభ‌కోణం నేప‌థ్యంలో సోషియో పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ యాక్ష‌న్ చిత్ర‌మిద‌ని చెబుతున్నారు. ఇందులో న‌క్స‌లైట్ పాత్ర‌లో చ‌ర‌ణ్ మెరిపిస్తారు అన్న‌ది ఆస‌క్తిని పెంచే మ్యాట‌రే.