అలా చేసి ఉయ్యాలవాడను తగ్గించను!-చరణ్

Wed Sep 18 2019 19:11:40 GMT+0530 (IST)

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `సైరా- నరసింహారెడ్డి` అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యే నెలరోజుల ముందు నుంచి ఉయ్యాలవాడ కుటుంబీకులు ఏదో ఒక రూపంలో నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. తమ కుటుంబానికి సైరా నిర్మాత ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకోలేదని.. తమను ఆర్థికంగా ఆదుకోలేదని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మీడియా ముందుకు వచ్చి తమ గోడును వెల్లబోసుకున్నారు. అయితే కోట్లలో ముట్టజెప్పాల్సింది గా ఉయ్యాలవాడ కుటుంబీకులు డిమాండ్ చేశారని మీడియాలో వార్తలొచ్చాయి. ఆ క్రమంలోనే నిర్మాత రామ్ చరణ్ దీనిపై స్పందించకపోవడంపైనా చర్చ సాగింది.ఇప్పటికీ ఉయ్యాలవాడ కుటుంబీకులు తమకు కొణిదెల కంపెనీ అన్యాయం చేసిందనే విమర్శిస్తున్నారు. అయితే ఇదే ప్రశ్న నేడు `సైరా` ట్రైలర్ వేడుకలో నిర్మాత రామ్ చరణ్ కి ఎదురైంది. ఉయ్యాలవాడ కుటుంబీకులు గొడవ చేస్తున్నారు కదా.. దానికి మీ సమాధానమేమిటి? అని ప్రశ్నిస్తే దానికి చరణ్ స్పందించారు. ఈ గొడవ నేను కూడా చూస్తున్నా.. నేను వాళ్లను కలిశాను. ఎవరికీ ఏ అన్యాయం జరగదు. ఏదైనా చరిత్రను తీసుకుని సినిమా తీస్తే ఒక మనిషి మరణించిన 100 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా సినిమా తీయొచ్చు. జీవిత చరిత్రపై సినిమా తీయాలనుకుంటే ఏ సమస్య లేకుండా తీయొచ్చని చట్టం చెబుతోంది.ఇంతకుముందు మంగళ్ పాండే అనే గ్రేట్ లీడర్ పై సినిమా తీసినప్పుడు ఇలాంటి ఇష్యూ వచ్చింది. ఆయన మరణించి 65 ఏళ్లకు సినిమా తీసినా చట్టపరంగా సమస్యేమీ రాలేదు... అని ఒక ఎగ్జాంపుల్ ని చరణ్ వివరించారు.

అయినా నరసింహారెడ్డిని ఒక కుటుంబానికి పరిమితం చేయడం సరికాదు. ఆయన ఒక ఊరి కోసం.. దేశం కోసం ఎంతో త్యాగం చేశారు. నేను ఏదైనా చేయాలనుకుంటే అది ఒక ఊరి కోసం చేస్తాను. జనం కోసం చేస్తాను. కుటుంబంలో నలుగురు వ్యక్తుల కోసం చేయను. అలా చేసి ఉయ్యాలవాడను తగ్గించను... అని చరణ్ ఎంతో ఎమోషన్ అయ్యారు. దీనిని బట్టి ఉయ్యాలవాడ కుటుంబీకులు స్వార్థపూరితంగా డిమాండ్ చేశారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే చరణ్ ఒక కుటుంబానికి కాదు.. ఆ ఊరికి ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యారని అర్థమవుతోంది.