సింగల్ స్క్రీన్ 2 కోట్లు - ఇదీ చిట్టిబాబు లెక్క

Tue May 15 2018 13:39:16 GMT+0530 (IST)

బహుశా రామ్ చరణే ఈ రికార్డ్స్ బ్రేక్ చేయలన్నా టైం పట్టేలా ఉంది. అంతగా రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తూనే ఉంది. రిలీజ్ అయిన ఇరవై రోజుల తర్వాత నిర్మాతలు పబ్లిసిటీ విషయంలో దూకుడు తగ్గించినప్పటికీ థియేటర్ల దగ్గర పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉండటం ట్రేడ్ ని సైతం నివ్వెరపరిచింది. గ్రామీణ నేపధ్యంలో రూపొందిన ఒక కమర్షియల్ సినిమా ఇంత రేంజ్ కు చేరుకోవడం అంటే మాటలు కాదు. తాజగా మరో పెద్ద రికార్డు రంగస్థలం సొంతం చేసుకునే దిశగా ఉంది. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఉన్న మెయిన్ థియేటర్ సుదర్శన్ 35 ఎంఎంలో రంగస్థలం 2 కోట్ల గ్రాస్ కు అతి దగ్గరలో ఉంది. ఇది ఇప్పటి దాకా బాహుబలి వల్ల మాత్రమే సాధ్యం అయ్యింది. విడుదల ముందున్న బజ్ ప్రకారం చూసుకుంటే బాహుబలికున్న క్రేజ్ లో రంగస్థలం సగం కూడా క్యారీ చేయలేదు. చరణ్ సినిమా అనే బ్రాండ్ తోనే బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చింది.అలాంటిది నాన్ బాహుబలి కాదు ఏకంగా బాహుబలి రికార్డునే టార్గెట్ చేయటం అంటే మాటలు కాదు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సింగల్ థియేటర్ లో కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమాలకు కోటి రూపాయలకు పైగా గ్రాస్ రావడం పెద్ద విషయం కాదు. కాని రెండు కోట్లు అంటే కలలో మాటే. దాన్ని సుసాధ్యం చేసింది రంగస్థలం.మొన్నటికి మొన్న సండే ఒక్క రోజే కొత్త సినిమాలకు ధీటుగా మూడు లక్షల దాకా గ్రాస్ తెచ్చిన విషయం తెలిసిందే. ఇలా సింగల్ స్క్రీన్ లో రెండు కోట్లు రాబట్టిన అరుదైన ఘనత కూడా రంగస్థలం దక్కించుకుంటుంది. 18న అదే థియేటర్లో అర్ధశతదినోత్సవం జరిపేందుకు మెగా ఫాన్స్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతటి ఘన విజయాన్ని రక్తదానం-అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సెలెబ్రేట్ చేసుకునేందుకు సిద్దపడుతున్నారు. మరి సుదర్శన్ ఫుల్ రన్ పూర్తయ్యే లోపు రంగస్థలం ఎంత వసూలు చేస్తుంది అనే దాని బట్టి రానున్న సినిమాలకు టార్గెట్ రెడీ అవుతుంది. సౌండ్ వినపడదు అంటూనే బాక్స్ ఆఫీస్ చెవులు పగిలిపోయే వసూళ్ళతో అదరగొట్టిన చిట్టిబాబు వీరంగం ఇంకా అయిపోలేదు.అమెజాన్ ప్రైమ్ లో అధికారిక ఒరిజినల్ ప్రింట్ బయటికి వచ్చేసినా బ్రేకులు వేసే సమస్యే లేదు అంటున్నాడు.