డిస్ట్రిబ్యూటర్ల కోసం రంగంలోకి మెగా హీరో

Fri May 13 2022 18:01:18 GMT+0530 (IST)

Ram Charan For Distributors

భారీ అంచనాల మధ్య విడుదలైన భారీ చిత్రం `ఆచార్య`. మెగాస్టార్ చిరంజీవి నుంచి రెండేళ్ల విరామం తరువాత వచ్చిన సినిమా ఇది. ఇందులో మెగాస్టార్ తో సాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించడం తో డబుల్ ధమాకా అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అంటూ నెట్టింట సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివకున్న ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చతంగా మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందించబోతున్నాడంటూ ఆనందించారు.కానీ సీన్ రివర్స్ . అనుకున్నది ఏ ఒక్కటీ జరగలేదు. ఫలితంగా భారీ డిజాస్టర్ ని చవిచూడాల్సి వచ్చింది. ఇద్దరు స్టార్ హీరోలు వున్నా అపజయమే ఎరుగని స్టార్ డైరెక్టర్ వున్నా కంటెంట్ ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ సినిమాకు శాపంగా మారింది. దీంతో అభిమానులు కోరుకున్న బ్లాక్ బస్టర్ గా మిగలలేదు సరికదా యావరేజ్ గానూ నిలబడలేకపోయింది. దీంతో ఈ సినిమా ఊహించని స్థాయిలో భారీ నష్టాలని చవిచూడాల్సి వచ్చింది.

చిరు చరణ్ ఉన్నారన్న ధీమాతో బయ్యర్లు ఎగ్జిబిటర్లు ఈ సినిమాకు భారీ రేట్లు పెట్టారు. అయితే సినిమా ఆశించిన  మేర ఆకట్టుకోలేకపోవడం యాంటీ ఫ్యాన్స్ డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో సినిమా 80 శాతం నష్టాల్లో కూరుకుపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరిని కదిలించిన ఈ సినిమా నష్టాల లెక్కలే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ మూవీ నష్టాల భారి నుంచి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లని కాపాడేందుకు నిర్మాత దర్శకుడు కొరటాల శివ రంగంలోకి దిగారు.

తమ తీసుకున్న మొత్తం లోంచి కొంత మొత్తాన్ని తిరిగి  డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లు చెల్లించారట. ఇప్పడు హీరోల వంతు వచ్చింది. చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా వుండగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి ప్రత్యేకంగా యుఎస్ కు వెకేషన్ కోసం వెళ్లారు. ఆయన జూన్ ఫస్ట్ వీక్ లో తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు. వచ్చిన వెంటనే `ఆచార్య` డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్ చేయాలనుకుంటున్నారట. దీని వల్ల తర తదుపరి చిత్రాలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చిరు భావిస్తున్నారట.

ఇదే తరహాలో రామ్ చరణ్ కూడా డిస్ట్రిబ్యూటర్లని ఆదుకోవాలనుకుంటున్నాడట. ఇందుకు ఇప్పటికే పలువురు డిస్ట్రిబ్యూటర్లకు చరణ్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే వారందరినీ ప్రత్యేకంగా కలిసి వారికి తన వంతు సాయం చేయబోతున్నారట. 80 శాతం నష్టాలని ఎదుర్కొన్న డిస్ట్రిబ్యూటర్లకు చిరు చరణ్ ఎంత వరకు ఆదుకుంటారన్నది ఇప్పడు ఇండస్ట్రీలో ప్రధాన చర్చగా మారింది. చిరు చరణ్ ఎంత వరకు డబ్బులు తిరిగి ఇవ్వబోతున్నారు?.. డిస్ట్రిబ్యూటర్ల లెక్కలేంటీ? అన్నది త్వరలోనే ఓ కొలిక్కి రానుందని ఇన్ సైడ్ టాక్.