చరణ్ అన్నా అంటూ పిలిచిన ఖిలాడీ కుమార్

Wed Jun 29 2022 11:00:01 GMT+0530 (IST)

Ram Charan Becomes Anna For Bollywood Sr star

పాన్ ఇండియా ట్రెండ్ అంతా మార్చేస్తోంది. ఉత్తరాదిన సౌత్ బ్లాక్ బస్టర్లను చూసాక ఇంతటి విజయానికి కారణం పాన్ ఇండియా ప్రచారం అని గ్రహించిన బాలీవుడ్ స్టార్లు ఇప్పుడు నెమ్మదిగా మారుతున్నారు. సౌత్ పై పెద్దగా దృష్టి సారిస్తున్నారు. తమ సినిమాల్ని ఇన్నాళ్లుగా కేవలం ఉత్తరాదికే పరిమితం చేయాలనుకోవడం ఎంతటి పొరపాటో బాలీవుడ్ అగ్ర హీరోలు గ్రహించారు. ఇప్పుడు ప్లాన్ ఛేంజ్ చేసి తమ సినిమాలకు దక్షిణాది టూటైర్ సిటీల్లోనూ ప్రచారం కోరుకుంటున్నారు.ఇటీవల బ్రహ్మాస్త్ర- శంషేరాకు రణబీర్ కపూర్ చేస్తున్న ప్రచారం ఈ తరహానే. ఇప్పుడు  ఖిలాడీ అక్షయ్ కుమార్ కూడా ఇదే దారిని ఎంచుకుంటున్నాడు. తన సినిమాల్ని దక్షిణాదినా ఆడించాలని అతడికి వ్యూహం ఉంది. తెలుగు అగ్ర హీరోలతో తన సత్సంబంధాలను అతడు పునరుద్ధరించుకుంటున్నారు.

అంతేకాదు.. ఇటీవల హిందీ సినిమాలకు తెలుగు అగ్ర హీరోలు ప్రచారం చేస్తుండడం కూడా కొత్త ట్రెండ్ గా మారింది. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్ తదుపరి చిత్రం 'రక్షా బంధన్' కు రామ్ చరణ్ ప్రచారం కూడా ఇదే కేటగిరీ అని భావిస్తున్నారు. రక్షాబంధన్ ట్రైలర్ ప్రచారం నేపథ్యంలో చరణ్ - అక్షయ్ నడుమ పరస్పర ప్రేమానుబంధాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అక్షయ్ సార్ అని చరణ్ పిలిచేస్తే అతడు మాత్రం చరణ్ అన్నా అని సంబోధించాడు.

రక్షా బంధన్  కొత్త ట్రైలర్ ను షేర్ చేస్తూ "వాట్ ఎ ట్రైలర్ అక్షయ్ కుమార్ సార్! అన్నా చెల్లెళ్ల అందమైన పవిత్రమైన బంధాన్ని ట్రైలర్ లో అద్భుతంగా చిత్రీకరించారు. దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ సర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని అన్నారు. అయితే దానికి రిప్లయ్ గా అక్షయ్ కుమార్ చరణ్ ని అన్నా అని పిలవడం ఆసక్తిని రేకెత్తించింది. "చాలా ధన్యవాదాలు రామ్ చరణ్ అన్నా .. మా పుట్టినరోజు అబ్బాయి ఆనంద్ ఎల్ రాయ్ లాగానే #రక్షాబంధన్ కథ హృదయాన్ని తాకేలా ఉంటుంది" అని అక్షయ్ కుమార్ రాశారు.

బాలీవుడ్ లో సీనియర్ స్టార్ గా అక్షయ్ కి ఎంతో గౌరవం ఉంది. గొప్ప ఫాలోయింగ్ అతడి సొంతం. దాదాపు మెగాస్టార్ చిరంజీవితో పోటీపడుతూ అతడు 150 సినిమాలకు చేరువ అవుతున్నాడు. ఇప్పటికే 137 చితాల్లో నటించాడు. సెట్స్ పై రెండు మూడు చిత్రాలు ఉన్నాయి. అంత పెద్ద స్టార్ కి ఇంకా 25 సినిమాలు అయినా చేయని చరణ్ అన్న ఎలా అయ్యాడు? అన్నదే అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.  బాలీవుడ్ వెటరన్ సూపర్ స్టార్ కు చరణ్ 'అన్న' అయ్యాడనేది మెగాభిమానులను ఒక రేంజులో ఎగ్జయిట్ చేస్తోంది.

అయితే ఇరు భాషలకు చెందిన ఇరువురు అగ్ర కథానాయకుల మధ్య సాన్నిహిత్యం భవిష్యత్ సమీకరణాలను మార్చేసేందుకు ఆస్కారం లేకపోలేదు. అక్షయ్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా సినిమా వస్తే చూడాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మరి ఆ దిశగా ప్రయత్నం జరుగుతుందేమో చూడాలి.