నవాబ్ ప్యాలెస్ ని మరిపించేలా మెగా హోమ్!

Thu Nov 21 2019 20:00:01 GMT+0530 (IST)

Ram Charan And upasana New House

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో కొత్త ఇంటిలోకి షిఫ్ట్ అవుతున్నారా? అంటే అవుననే సమాచారం. పలాటియల్ రెసిడెన్స్ పేరుతో నిర్మించిన ఈ నూతన భవంతిలోకి ఈ వారాంతంలోనే షిఫ్ట్ అవుతున్నారని సమాచారం. మెగా లగ్జరీ హోమ్ నైజాం నవాబ్ ప్యాలెస్ నే తలపిస్తోందన్నది ఇన్ సైడ్ టాక్. మరింత వివరంగా వెళితే..మద్రాసు పరిశ్రమ నుంచి విడిపోయి టాలీవుడ్ హైదరాబాద్ లో స్థిరపడే క్రమంలో ఎన్టీఆర్..ఏఎన్నార్ లాంటి దిగ్గజాలు సహా మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఆయన జూబ్లీ హిల్స్ లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో రాజకీయాలకు కామా పెట్టి ఖైదీనంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చారు. 151వ సినిమా సైరా నరసింహారెడ్డి ఇటీవలే రిలీజై విజయం అందుకుంది. ఆ క్రమంలోనే పలుమార్లు మీడియా సమావేశాలు ఈ హౌస్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ ఇంటికి అత్యంత సమీపంలోనే కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్ కార్యాలయంలోనూ మీడియా మీట్ లు ఏర్పాటు చేసారు.

అదంతా సరే కానీ.. రామ్ చరణ్ వివాహానంతరం మెగాస్టార్ చిరంజీవి ఉంటున్న ఇల్లు మొత్తం కుటుంబానికి సరిపోవడం లేదని దాంతో మరో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారని ప్రచారమైంది. చరణ్- ఉపాసన ఇంటర్నేషనల్ రేంజ్ ఆర్కిటెక్ట్ తో ఈ ఇంటిని నిర్మిస్తున్నారని భారీగా ఖర్చు చేస్తున్నారని చెప్పుకున్నారు. ఎట్టకేలకు ఈ ఇల్లు రెడీ అయ్యింది. `పలాటియల్ రెసిడెన్స్` అనేది ఈ భవంతి పేరు. 25000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సకలసౌకర్యాలతో దీనిని నిర్మించారు.  

ముంబైకి చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ తహిలియానీ వాళ్లు ఈ ఇంటిని డిజైన్ చేశారు. భారతీయ సాంప్రదాయం  ప్రాచీన కళల  మేళవింపుతో నేటి అధునాతన వసతులతో ఈ ఇంటిని నిర్మించారు ఒక గదిలో చెస్ బోర్డ్ తరహా పాలరాతి ఫ్లోరింగ్ తో డిజైన్ చేయించారు. హాల్ లో గోడలు.. సీలింగ్.. జేడ్ తరహా డెకరేషన్ తో ప్రతిదీ అద్భుతమైన డిజైన్ తో తీర్చిదిద్దారు. అలాగే ఈ ఇంటిలో నిర్మించిన దైవమందిరం ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. రెండో శతాబ్ధం నాటి దేవాలయాల తరహాలో ప్రాచీన చరిత్ర ఉన్న డిజైన్ తో రూపొందించారు. హైదరాబాద్ లో నైజాం కాలం నాటి డిజైనర్ లుక్ ని ఈ భవంతికి తీసుకొచ్చారు. జూబ్లీహిల్స్ లోని ఎం.సి.హెచ్.ఆర్.డి ఇనిస్టిట్యూట్ సమీపంలో ఈ ఇంటిని నిర్మించారు. ఇక ఈ ఇంటిని నిర్మించేందుకు కోట్లాది రూపాయల్ని వెచ్చించారని .. ఇంటీరియర్ డిజైన్ కోసం చరణ్ భార్య ఉపాసన ఎంతో శ్రద్ధ తీసుకున్నారని చెబుతున్నారు.