రకుల్ తప్ప వారికి మరో ఆప్షన్ లేదా?

Tue Aug 04 2020 21:30:01 GMT+0530 (IST)

Is there no other option for them except Rakul?

తెలుగు ప్రముఖ వెయిట్ లిఫ్టర్.. ఒలింపిక్ పతాక విజేత కరణం మల్లేశ్వరి బయోపిక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే టైటిల్ రోల్ ను పోషించేది ఎవరు ఆ స్థాయిలో ఫిజిక్ ఉన్న హీరోయిన్ ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారు అనే విషయంలో చర్చ జరుగుతోంది. మేకర్స్ ఈ పాత్ర కోసం పలువురు స్టార్ హీరోయిన్స్ తో సంప్రదింపులు జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అంతటి ఛాలెంజింగ్ పాత్రను చేసేందుకు కొందరు హీరోయిన్స్ భయపడుతూ ఉంటే కొందరు మాత్రం తమకు తామే ఆ పాత్రకు సెట్ అవ్వక పోవచ్చు అంటున్నారు.ఈ చిత్రంకు ఒక నిర్మాత అయిన కోన వెంకట్ టైటిల్ రోల్ ను తాప్సి తో చేయించాలని బలంగా కోరుకున్నాడట. అయితే ఆమె బాలీవుడ్ లో ముందుగా కమిట్ అయిన సినిమాల కారణంగా ఈ సినిమాలో నటించలేను అంటూ చెప్పిందట. సమంత వెయిట్ లిఫ్టింగ్ లో మంచి ప్రతిభ కనబర్చుతుంది. రెగ్యులర్ ఆమె వర్కౌట్స్ చేస్తుంది. కనుక ఆమెను ఈ సినిమా కోసం తీసుకుంటే బాగుంటుందని అనుకున్నారు. కాని ఆమె కూడా ప్రస్తుతం ఆ సినిమాపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

సమంత నో చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టి రకుల్ పై ఉంది. గతంలో కూడా ఈ చిత్రంలో రకుల్ నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రచారం మరింత ఎక్కువ అయ్యింది. ఎందుకంటే మేకర్స్ ముందు రకుల్ తప్ప మరో ఆప్షన్ లేదంటున్నారు. జిమ్ బిజినెస్ ఉన్న రకుల్ కు వర్కౌట్స్ వెయిట్ లిఫ్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే చాలా పెద్ద బరువులనే ఎత్తుతూ రకుల్ గతంలో వీడియోలు పెట్టింది. ఆమె కండలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. కనుక కరణం మల్లేశ్వరి పాత్రకు గాను రకుల్ ఫైనల్ ఛాయిస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.