వికారాబాద్ అటవీ ప్రాంతంలో రకుల్..!

Mon Sep 21 2020 16:40:27 GMT+0530 (IST)

Rakul in Vikarabad forest area

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఈ మధ్య దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడి విచారణ ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తి.. రకుల్ ప్రీత్ పేరును వెల్లడించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో రకుల్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో రకుల్ ఉన్నపలంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి హైకోర్టును ఆశ్రయించింది. మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్ట్ రకుల్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అధికారికంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదయ్యే వరకు ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి కథనాలు ప్రచురించకూడదని ఆదేశించింది. దీంతో రకుల్ తిరిగి హైదరాబాద్ కు వచ్చేసింది.కాగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. మెగా హీరో వైష్ణవ్ తేజ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అటవీ ప్రాంతంలో జరుగుతోంది. షూటింగ్ సమయంలో ఆమెపై డ్రగ్స్ ఆరోపణలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళింది. అయితే ఇప్పుడు మళ్ళీ షూటింగ్ లో పాల్గొంది రకుల్. గత రెండు రోజులుగా వర్షాల కారణంగా ఆగిపోయిన షూటింగ్ నేడు తిరిగి వికారాబాద్ లో ప్రారంభం అయిందని తెలుస్తోంది. ఈ షూట్ లో రకుల్ కూడా పాల్గొన్నారని సమాచారం. ఈ సినిమాలో రకుల్ గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరిపి వచ్చే నెల చివరి వారానికి పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.