Begin typing your search above and press return to search.

'ఎన్సీబీ నన్ను సాక్షిగా మాత్రమే పిలిచింది'

By:  Tupaki Desk   |   29 Sep 2020 12:10 PM GMT
ఎన్సీబీ నన్ను సాక్షిగా మాత్రమే పిలిచింది
X
బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తితో పరిచయం గురించి.. రియాతో రకుల్ జరిపిన వాట్సాప్ చాటింగ్ గురించి ఎన్సీబీ ఆమెను ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రియాతో చాట్ చేసినట్లు అంగీకరించిన రకుల్.. తనకు డ్రగ్స్ లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని.. తాను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని ఎన్సీబీకి తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే కోర్టు చెప్పినా తనకు వ్యతిరేకంగా మీడియా కథనాలు ప్రచారం చేయడాన్ని రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హై కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో తనకు సిగరెట్ తాగే అలవాటు కూడా లేదని.. ఆల్కహాల్ కూడా తీసుకోనని.. డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో తనను సాక్షిగా మాత్రమే విచారణకు పిలిచిందని.. అయినా మీడియాలో తనపై వ్యతిరేక వార్తలు వస్తున్నాయని రకుల్‌ తన పిటిషన్‌ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రకుల్ పిటిషన్ పై స్పందించిన హైకోర్ట్.. రకుల్ పేరును డ్రగ్స్ కేసుకు ముడిపెడుతూ మీడియాలో కథనాలు రాకుండా నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో అక్టోబర్ 3 లోపు నివేదిక ఇవ్వాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ - ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా - నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ లను ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా అక్టోబర్ 15న కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించనుంది. కాగా, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మీడియా కథనాలు ఉన్నాయని.. డ్రగ్స్ కేసులో తన గురించి ప్రసారం అవుతున్న వార్తలను ఆపాలని కోరుతూ రకుల్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.