Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘రాజు గారి గది-2’

By:  Tupaki Desk   |   13 Oct 2017 8:07 AM GMT
మూవీ రివ్యూ : ‘రాజు గారి గది-2’
X
చిత్రం : ‘రాజు గారి గది-2’

నటీనటులు: అక్కినేని నాగార్జున - సమంత - సీరత్ కపూర్ - అశ్విన్ - వెన్నెల కిషోర్ - ప్రవీణ్ - షకలక శంకర్ - నరేష్ - అభినయ - నందు తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: దివాకరన్
మూల కథ: రంజిత్ శంకర్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాణం: పీవీపీ సినిమా - మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ - ఓక్ ఎంటర్టైన్మెంట్స్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఓంకార్

టెలివిజన్ హోస్ట్ గా కెరీర్ ఆరంభించి.. ఆపై దర్శకుడిగా మారిన ఓంకార్.. తొలి ప్రయత్నంగా చేసిన ‘జీనియస్’ చేదు అనుభవాన్ని మిగిల్చినా.. ‘రాజు గారి గది’ మంచి ఫలితాన్నే అందించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా అక్కినేని నాగార్జున.. సమంత లాంటి పెద్ద తారలతో ‘రాజు గారి గది-2’ తీశాడు ఓంకార్. మంచి ప్రోమోలతో ఆకర్షించిన ఈ హార్రర్ కామెడీ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అశ్విన్ (అశ్విన్ బాబు).. రవి (వెన్నెల కిషోర్).. ప్రవీణ్ (ప్రవీణ్) అనే ముగ్గురు మిత్రులు కలిసి బిజినెస్ చేయాలన్న ఉద్దేశంతో ఓ రిసార్ట్ కొంటారు. ఆ రిసార్ట్ కార్యకలాపాలు మొదలై అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఈ ముగ్గురికీ అక్కడ అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. అక్కడో దయ్యం ఉన్న సంగతి వాళ్లకు తెలిసొస్తుంది. దీంతో దయ్యం ఆట కట్టించడం కోసం రుద్ర (నాగార్జున) అనే మెంటలిస్టును కలుస్తారు. అతనొచ్చి దయ్యం గుట్టు విప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ ఆ రిసార్ట్ లో నిజంగానే దయ్యం ఉందా.. ఉంటే దాని కథేంటి.. అది అక్కడే ఎందుకు తిరుగుతోంది.. చివరికి దాని కోరిక తీరిందా లేదా అన్నది తెర మీదే చూడాలి.

కథనం - విశ్లేషణ:

తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ జానర్లలో హార్రర్ కామెడీ ఒకటి. దీనికి కొన్ని సానుకూలతలున్నాయి. భారీ లొకేషన్లు అవసరం లేదు. ఒకే భవంతిలో సినిమా మొత్తం చుట్టేయొచ్చు. ఒక హీరో హీరోయిన్.. ఇద్దరు ముగ్గురు కమెడియన్లుండి.. ఓ మోస్తరు స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ జోడించి.. నాలుగు హార్రర్ సీన్లు.. నాలుగు కామెడీ సీన్లు పెట్టుకుంటే పనైపోతుంది. కథ విషయంలో పెద్దగా శ్రమ కూడా అక్కర్లేదు. భయం.. నవ్వు.. ఈ రెండు రసాల్ని పండిస్తే సులువుగా ఒడ్డున పడిపోవచ్చు. ఈ ఫార్ములాతోనే కొందరు ఫిలిం మేకర్స్ పెద్ద విజయాలు సాధించారు. కాకపోతే మిగతా జానర్లతో పోలిస్తే హార్రర్ కామెడీ చాలా త్వరగా మొహం మొత్తేసింది. ఈ జానర్లలో తెరకెక్కిన సినిమాలన్నీ ఒకేరకంగా ఉంటుండటమే దీనికి కారణం. ఐతే ఇంతకుముందు చూసిన హార్రర్ కామెడీలకు ‘రాజు గారి గది-2’ చాలా రకాలుగా భిన్నంగా అనిపిస్తుంది.

ఒక వ్యక్తి చనిపోవడం.. దయ్యంగా మారి ఒక భవంతిలో తిరగడం.. అక్కడుండేవాళ్లు భయపడటం.. తర్వాత ఆ దయ్యం ఫ్లాష్ బ్యాక్ తెలియడం.. చివర్లో ప్రతికారం.. హార్రర్ కామెడీలన్నీ దాదాపుగా ఈ ఫార్మాట్లో సాగేవే. ఔట్ లైన్ చూస్తే ‘రాజు గారి గది-2’ కూడా దాదాపుగా ఇదే తరహాలో ఉంటుంది. కానీ ఈ దయ్యం తాలూకు వ్యవహారం.. ఆ కథను ఛేదించే తీరు.. ఇవన్నీ భిన్నంగా కనిపిస్తాయి. ఇప్పటిదాకా చిన్న స్థాయి తారాగణంతో.. పరిమితమైన ప్రొడక్షన్ వాల్యూస్.. టెక్నికల్ సపోర్ట్ తో హార్రర్ కామెడీ చూసిన జనాలకు.. ‘రాజు గారి గది-2’ అన్ని రకాలుగా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది. ఐతే ఇది నిఖార్సయిన ‘హార్రర్ కామెడీ’లా లేకపోవడం మాత్రం ఆ జానర్ ను ఇష్టపడే ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేస్తుంది. ఇందులో కామెడీ కానీ.. హార్రర్ కానీ అనుకున్న స్థాయిలో పండలేదు.

హార్రర్.. కామెడీ అంశాల కంటే కూడా ఒక సామాజిక సమస్య మీద ఎమోషనల్ గా ఈ కథను నడిపించే ప్రయత్నం చేశాడు ఓంకార్. సినిమాకు ప్రధాన బలంగా నిలిచే అంశం ఇదే. ఈ సమస్యతో ముడిపడ్డ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ప్రభావవంతంగా చూపించడంలో ఓంకార్ విజయవంతమయ్యాడు. ప్రథమార్ధమంతా మామూలు కాలక్షేపం బాపతులా కనిపించే ‘రాజు గారి గది-2’ ద్వితీయార్ధంలో మాత్రం బలమైన పాయింట్ మీద ఇంటెన్స్ గా సాగుతూ.. మనసుల్ని తాకుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన బలం. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా.. ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునే ఓ పెద్ద సమస్య చుట్టూ కథను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ ఎపిసోడ్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది.

ఐతే ‘రాజు గారి గది’లో తాను కామెడీని బాగా డీల్ చేయగలనని రుజువు చేసుకున్న ఓంకార్.. ఇందులో ఆ పనితనాన్ని చూపించలేకపోయాడు. వెన్నెల కిషోర్ లాంటి సూపర్ ఫామ్ లో ఉన్న కమెడియన్.. హార్రర్ కామెడీలకు పెట్టింది పేరైన ప్రవీణ్.. షకలక శంకర్ లాంటి ఆర్టిస్టులు అందుబాటులో ఉన్నా అనుకున్న స్థాయిలో ఇందులో కామెడీ పండించలేకపోయాడు. ప్రథమార్ధంలో కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు ఓ మోస్తరుగా అనిపిస్తాయంతే. పేలిపోయే కామెడీ సీన్లయితే ఏమీ లేవు. వెన్నెల కిషోర్.. షకలక శంకర్ అక్కడక్కడా కొంచెం మెరిసినప్పటికీ డోస్ సరిపోలేదు. దీనికి తోడు అసలు కథలోకి వెళ్లేముందు కాలక్షేపానికి పెట్టిన సన్నివేశాలు విసిగిస్తాయి. సీరత్ కపూర్ పాత్ర కుర్రాళ్లకు అందాల వల వేసే ప్రయత్నం చేసింది కానీ.. ఆమె అంతగా ఆకట్టుకోదు.

అసలు నాగార్జున పాత్ర ప్రవేశించే వరకు కథలో కదలికే ఉండదు. ప్రేక్షకులు అసహనానికి గురవుతున్న దశలో నాగ్ పాత్ర రాకతో ఉపశమనం లభిస్తుంది. మెంటలిస్ట్ అంటే ఏంటో.. అతను నిందితుల్ని ఎలా ఇంటరాగేట్ చేసి.. కేసుల్ని ఛేదిస్తాడో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. రుద్ర పాత్ర దయ్యాన్ని తన దారిలోకి తెచ్చుకునే.. ఆ తర్వాత దయ్యం గతాన్ని వెలికి తీసే క్రమాన్ని కూడా బాగా చూపించారు. ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ గా సాగుతుంది. ముగింపులో మెలో డ్రామా.. ప్రీచింగ్ కొంచెం ఎక్కువైనట్లు అనిపించినప్పటికీ.. ఈ సన్నివేశాలు ఎమోషనల్ గా టచ్ చేస్తాయి. ద్వితీయార్ధమంతా మనం ఒక హార్రర్ కామెడీ చూస్తున్నామన్న సంగతే మరిచిపోతాం. జానర్ తో సంబంధం లేకుండా ఒక ఎమోషనల్.. సెంటిమెంట్ సినిమాలా సాగుతుంది. ఐతే హార్రర్ కామెడీ అనగానే వినోదం ఆశించే ప్రేక్షకులకు ద్వితీయార్ధం ఏమాత్రం ఎక్కుతుందన్నది కొంచెం సందేహమే. ఐతే సినిమా ద్వారా ఇవ్వాలనుకున్న సందేశాన్ని ప్రభావవంతంగా చెప్పగలిగారు. నాగార్జున.. సమంతల పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. వాళ్ల కలయికలో వచ్చే పతాక సన్నివేశం బాగా తీర్చిదిద్దారు. ఓంకార్ తీసిన దయ్యం సినిమా కాబట్టి ‘రాజు గారి గది-2’ అనే టైటిల్ పెట్టాడు తప్ప.. ఆ టైటిల్ తో ఈ సినిమాకు ఏ సంబంధం లేదు.

నటీనటులు:

నాగార్జున ఓ కొత్త తరహా పాత్రలో కనిపించాడు. మెంటలిస్ట్ క్యారెక్టర్లో ఆయన భిన్నంగా కనిపిస్తాడు. ఈ పాత్ర తీరుతెన్నుల్ని అర్థం చేసుకుని నాగ్ బాగా నటించాడు. కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ చూపించేసిన భావన కలుగుతుంది. ద్వితీయార్దాన్ని నాగ్ తన భుజాల మీద నడిపించాడు. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ లో నాగ్ పరిణతితో కూడిన నటనతో ఆకట్టుకున్నాడు. అమృత పాత్రలో సమంత కట్టిపడేస్తుంది. ఇలాంటి పాత్రను ఆమె ఒప్పుకోవడమే గొప్ప విషయం. తన నటనతో సమంత కన్నీళ్లు పెట్టించేస్తుంది. నిడివి తక్కువే అయినప్పటికీ సమంత బలమైన ముద్ర వేస్తుంది. అభినయ కూడా బాగా చేసింది. నందుకు పెద్దగా రోల్ లేదు. దర్శకుడు ఓంకార్ తమ్ముడు అశ్విన్ ఓకే అనిపిస్తాడు. వెన్నెల కిషోర్ అక్కడక్కడా తన హావభావాలతో నవ్విస్తాడు. కానీ అతడి స్థాయికి తగ్గ కామెడీ డోస్ అయితే ఇవ్వలేదు. షకలక శంకర్ ఒక సీన్లో నవ్వించాడు. ప్రవీణ్.. నరేష్ పర్వాలేదు. సీరత్ కపూర్ ను అందాల ప్రదర్శనకే పెట్టుకున్నట్లున్నారు. ఆమె లుక్స్ పెద్దగా ఆకట్టుకోవు. తన పాత్ర కూడా పేలవం.

సాంకేతికవర్గం:

‘రాజు గారి గది-2’కు సాంకేతిక హంగులు బాగా కుదిరాయి. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. హార్రర్ తో ముడిపడ్డ సన్నివేశాలతో పాటు ద్వితీయార్దంలో ఎమోషనల్ సీన్స్ లోనూ తమన్ తన పనితనం చూపించాడు. ఇందులో పూర్తిస్థాయి పాటలేమీ లేవు. రెండు బిట్ సాంగ్స్ ఉన్నాయంతే. అవి ఆకట్టుకోవు. దివాకరన్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ ను పరిమితంగానే వాడుకున్నప్పటికీ అవి ఆకట్టుకుంటాయి. స్కెచ్ సీన్.. మరి కొన్ని సన్నివేశాల్లో వీఎఫెక్స్ మెప్పిస్తాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సినిమా రిచ్ గా అనిపిస్తుంది. అబ్బూరి రవి మంచి మాటలు రాశాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో మాటలు కదిలిస్తాయి. కాకపోతే అక్కడ ప్రీచింగ్ కొంచెం తగ్గించాల్సిందే. లెంగ్త్ కొంచెం ఎక్కువైంది. ఇక దర్శకుడు ఓంకార్.. మలయాళ ‘ప్రేతమ్’ నుంచి కథను తీసుకుని దానికి ఇక్కడి నేటివిటీతో ట్రీట్మెంట్ ఇచ్చాడు. ద్వితీయార్దంలో దర్శకుడిగా అతడి పనితనం కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్లను బాగా తీర్చిదిద్దాడు. కానీ ఈ జానర్ నుంచి ఆశించే హార్రర్.. కామెడీని అతను ఆశించిన స్థాయిలో పండించలేకపోయాడు. ఓవరాల్ గా ఓంకార్ పనితనం ఓకే అనిపిస్తుంది.

చివరగా: రెండో ‘గది’లో కామెడీ తక్కువ.. ఎమోషన్ ఎక్కువ!

రేటింగ్- 2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre