Begin typing your search above and press return to search.

పట్టాలెక్కనున్న రాజుగారి గది-4..??

By:  Tupaki Desk   |   14 Jun 2021 11:30 AM GMT
పట్టాలెక్కనున్న రాజుగారి గది-4..??
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో టీవీ యాంకర్ - డైరెక్టర్ - ప్రొడ్యూసర్ ఇలా అన్నివిధాలా సక్సెస్ అందుకున్నాడు ఓంకార్. అలాగే అన్ని విభాగాలలో మంచి ఫేమ్ నేమ్ కూడా గడించాడు. ప్రస్తుతం కరోనా టైం కావడంతో టీవీలో ప్రోగ్రాంస్ చేసుకుంటూ తదుపరి సినిమాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇంతకాలం తన సొంత టాలెంట్ - క్రియేటివిటీతో రియాలిటీ షోస్ నిర్వహిస్తూ తానే యాంకరింగ్ చేస్తూ వచ్చాడు. ఓ వైపు టీవీ షోస్ చేస్తూనే మరోవైపు నెక్స్ట్ సినిమాలకు స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు టాక్.

టీవీ ప్రేక్షకులకు ఓంకార్ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆల్రెడీ తన ఫేవరేట్ జానర్ అయినటువంటి హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించాడు. మొదటగా జీనియస్ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు ఓంకార్. ఆ తర్వాత రాజుగారి గది సినిమాలో దర్శకత్వం వహించాడు. ఆ సినిమా ఓంకార్ కు ఫస్ట్ సక్సెస్ అందించింది. అదే ఊపుతో రాజుగారి గది-2 తీసాడు ఆ సినిమా కూడా సక్సెస్ తెచ్చిపెట్టింది. అయితే ఈ రాజుగారి గది సిరీస్ అన్నింట్లో ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు.

అలా 2019లో రాజుగారి గది 3 తెరకెక్కించాడు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఓంకార్ తదుపరి రాజుగారి గది-4 రూపొందించే ప్రణాళికలో ఉన్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం అయిపోయిందట. ప్రస్తుతం ఓంకార్ 'సిక్స్త్ సెన్స్' అనే టీవీ ప్రోగ్రాం చేస్తున్నాడు. ఆ ప్రోగ్రాం ఇటీవలే ప్రారంభం అయింది. ఇప్పుడు కరోనా పరిస్థితి నెలకొనడంతో ఓంకార్ ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నాడు. లేకపోతే ఆల్రెడీ రాజుగారి గది -4 పట్టాలెక్కేదని టాక్.

అలాగే ఇటీవలే ఓంకార్ కూడా ఓ మీడియా ఇంటర్వ్యూలో రాజుగారి గది-4 ఉంటుందని క్లారిటీ ఇచ్చాడని టాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. ఈ హారర్ స్టోరీతో పాటు ఓంకార్ ఓ స్పోర్ట్స్ నేపథ్యం కలిగిన మూవీ.. అలాగే గ్రామీణ నేపథ్యంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలిపాడు. పరిస్థితుల కారణంగా ఓంకార్ టీవీ షో నిర్వహిస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. ఈ సెక్ట్ సెన్స్ ప్రోగ్రాం అయిపోగానే రాజుగారి గది-4 ప్రారంభం కాబోతుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చూడాలి మరి త్వరలోనే ప్రకటన రానుందేమో!