మోషన్ పోస్టర్: 'పెద్దన్న' గా అదరగొట్టిన రజినీ..!

Fri Oct 22 2021 20:42:38 GMT+0530 (IST)

Rajinikanth peddanna movie motion poster

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ''అన్నాత్తే''. మాస్ డైరెక్టర్ సిరుతై శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని తెలుగులో ''పెద్దన్న'' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన తమిళ మోషన్ పోస్టర్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా తెలుగు మోషన్ పోస్టర్ ని మేకర్స్ ఆవిష్కరించారు.'నాడి నరం నిప్పులు చెరగ.. రక్తం మొత్తం సలసల మరగ.. రంగస్థలమే దద్దరిల్లాగా.. మొదలైంది ఓంకార తాండవం..' అనే బ్యాగ్రౌండ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ''పెద్దన్న'' టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. రజినీకాంత్ పంచె కట్టులో బైక్ పైన కూర్చొని.. చేతిలో కట్టిపట్టుకొని ఉన్న పవర్ ఫుల్ లుక్ ను రివీల్ చేశారు. రజనీ ఎంతో ఉత్సాహంగా రెట్టింపు ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఆయనకు ఎప్పటిలాగే సింగర్ మనో డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.

''పెద్దన్న'' మోషన్ పోస్టర్ కు డి.ఇమ్మాన్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ - కెమెరామెన్ వెట్రి పలనిస్వామి అందించిన విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. రజినీకాంత్ తరహా యాక్షన్ సీన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నట్లు ఇందులో శాంపిల్ గా చూపించారు.

ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న 'పెద్దన్న' సినిమాలో నయనతార - ఖుష్బూ - మీనా - కీర్తి సురేష్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - జగపతి బాబు - సూరి - అభిమన్యు సింగ్ - సతీష్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రూబెన్ ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేయగా.. దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. మిలన్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

'అన్నాత్తే' చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. తెలుగులో 'పెద్దన్న' సినిమాని ఏషియన్ నారాయణదాస్ కె. నారంగ్ మరియు సురేష్ బాబు కలిసి రిలీజ్ చేస్తున్నారు. 'దర్బార్' తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వస్తున్న రజినీకాంత్.. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.