#రజనీ.. పార్టీ ప్రారంభించాలంటే సినిమా పూర్తవ్వాలా?

Sat Dec 05 2020 12:00:01 GMT+0530 (IST)

Rajini makes His political debut in January 2021!

రాజకీయారంగేట్రం అంటే స్టార్లకు అదో ప్రహసనంగానే కనిపిస్తోంది. ఎన్నిటినో భేరీజు వేసుకుని పార్టీని ప్రకటించాల్సి ఉంటుంది. ఒకసారి ప్రకటించి రాజకీయంలోకి దిగితే దానిని రణంలా నడిపించాల్సి ఉంటుంది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ వార్ నడిపించాలి. అందుకేనేమో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇన్నాళ్లు ఇంతటి డైలమాలో ఉన్నారు. ఒకసారి పార్టీని ప్రకటిస్తే ఇక వెనుదిరిగి చూడకూడదనే పంతంతో ఆయన ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందరో స్టార్లు పార్టీలు పెట్టి విఫలమవుతున్న తీరును తీరిగ్గా పరిశీలించి ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతోంది.ఎట్టకేలకు సుదీర్ఘ కాలం గందరగోళ పరిస్థితుల తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ చివరకు రాజకీయ ప్రవేశానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ పార్టీని జనవరి-1 న ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే పార్టీ ప్రకటనకు పంటి కింద రాయిలా ఆయన తాజా షెడ్యూల్స్ అడ్డంకిగా మారాయి. సినిమా పూర్తయితే కానీ పార్టీని ప్రకటించలేం! అన్నట్టుగానే ఉందీ సీన్.

ఇటీవల కరోనా లాక్ డౌన్ కారణంగా రజినీ కొత్త చిత్రం `అన్నాథే` షూటింగ్ ఎనిమిది నెలల క్రితం నిలిచిపోయింది. మార్చి నుంచి జరగబోయే తమిళనాడు సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించే విధంగా ఫిబ్రవరి చివరి నాటికి సినిమాను పూర్తి చేయడానికి రజనీకాంత్ ఆసక్తి చూపుతున్నారన్నది సంచలనంగా మారింది. అన్నాథే పూర్తయితే తనకు ఇక ఎదురుండదు. సినిమా షెడ్యూల్ పంటికింద రాయిలా తగలదు. పూర్తిగా పార్టీపైనే దృష్టి సారించి వార్ లో వారియర్ లా దూసుకెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. పైగా రెండు పడవల పయనం తనకు అంతగా రుచించదు. అందుకే రజనీ పర్ఫెక్ట్ ప్లాన్ తో మూవ్ అవుతున్నారని భావిస్తున్నారు.

అన్నాతే చిత్రానికి తెలుగు వాడైన శివ దర్శకత్వం వహిస్తున్నారు. తళా అజిత్ తో హ్యాట్రిక్ విజయాల్ని తెరకెక్కించిన శివ కెరీర్ ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్ ఇది. `అన్నాతే`లో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది.