Begin typing your search above and press return to search.

మొదటిసారి రిస్కులో పడ్డ రాజమౌళి

By:  Tupaki Desk   |   4 Aug 2020 4:00 AM GMT
మొదటిసారి రిస్కులో పడ్డ రాజమౌళి
X
దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి తన కెరీర్ లో మొదటి సారి రిస్కులో పడ్డాడు. ఇది వరకు ఈ మాట అంటే రాజమౌళికా... రిస్కా.. అనే వాళ్ళమేమోకానీ ప్రస్తుతం ఆయన రిస్క్ తప్పనిసరిగా ఫేస్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మగధీర చిత్రీకరణ కు మొదటి సారి ఆయన రెండేళ్ల సమయం తీసుకోగా సినిమా విడుదలకు ముందు ఆయనపై విమర్శలు వచ్చాయి. ఒక సినిమా కోసం రెండేళ్లు తీసుకోవాలా.. అని అందరూ అన్నారు. కానీ సినిమా విడుదల అయ్యాక తెరపై ఆ భారీతనం, గ్రాఫిక్స్, హీరో ఎలివేషన్ అవన్నీ చూసి రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు. ఆ తర్వాత కమెడియన్ సునీల్ తో 'మర్యాద రామన్న' తీసి బంపర్ హిట్ కొట్టి చూపాడు. 'ఈగ'తోనూ మాయాజాలం చేశాడు. ఆ తర్వాత 'బాహుబలి'తో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేశాడు.

ఇలా ప్రతీ సారి రిస్కు ఎదురైనా ఫేస్ చేస్తూ ముందుకెళ్లాడు రాజమౌళి. కానీ 'ఆర్ఆర్ఆర్' విషయంలో మాత్రం జక్కన్న ఆందోళనలో ఉన్నాడు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ సినిమా 2019 వేసవిలో షూటింగ్ మొదలవగా 2020 జూలై 31కి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇద్దరు అగ్ర హీరోలతో పాన్ ఇండియా మూవీ కావడంతో రూ. 350 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు నిర్మాత డీవీవీ దానయ్య ముందు కొచ్చారు. అయితే ముందు రాంచరణ్, ఆ తర్వాత ఎన్టీఆర్ గాయపడడంతో షూటింగ్ కాస్త డిలే అయ్యింది.

దీంతో ఎప్పటిలాగే రాజమౌళి రిలీజ్ డేట్ మారుస్తూ 2021 జనవరి 8న సంక్రాతి పురస్కరించుకొని చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి ఎంటరై సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. ఇప్పటికే చిత్రీకరణ ఆలస్యమై బడ్జెట్ పెరిగి పోగా కరోనా నిర్మాతను దెబ్బేసింది. షూటింగ్ కి ప్రభుత్వాల అనుమతి తీసుకుని మళ్లీ సెట్లు వేసి రాజమౌళి అంతా సిద్ధం చేసుకున్నారు.

ట్రైల్ గా ఓ వంద మందితో చిత్రీకరణ మొదలు పెడతామని ప్రకటించినా ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. అలా షూటింగ్ డిలే అవుతుండగానే రాజమౌళి కరోనా బారిన పడ్డట్లు షాక్ లాంటి వార్త బయటకొచ్చింది. నాతో సహా తమ కుటుంబంలో కూడా పలువురికి వ్యాధి సోకిందని, చికిత్స పొందుతున్నట్లు స్వయానా రాజమౌళే ప్రకటించారు. దీంతో 'ఆర్ఆర్ఆర్' సంక్రాతి రేసు నుంచి తప్పుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతా సిద్ధం చేసి వేసవికి వచ్చినా అప్పటికి బడ్జెట్ తడిసి మోపెడు అవుతుంది. అప్పటికల్లా కరోనా నిబంధనలు అమల్లోకి వచ్చి థియేటర్లలో సీటింగ్ సామర్థ్యం తగ్గిస్తే రాజమౌళి రేంజ్ కలెక్షన్లు వచ్చే అవకాశం లేదు.

లాంగ్ రన్ లో వస్తాయిలే అనుకున్నా బొమ్మ రిలీజ్ అయిన రాత్రికే నెట్లో పైరసీ ప్రింట్ పెట్టేస్తున్నారు. ఇన్ని సమస్యలు ఎదురుకోవాల్సి ఉండటంతో రాజమౌళి తొలిసారి రిస్కులో పడ్డాడని అనుకుంటున్నారు. మరి రాజమౌళి ఎప్పట్లా తన స్టయిల్లో వీటన్నింటినీ బ్రేక్ చేసి సూపర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.