మహేష్ మూవీపై అమెరికాలో హైప్ ఎక్కిస్తున్న జక్కన్న..!

Sat Oct 01 2022 19:10:07 GMT+0530 (India Standard Time)

Rajamouli is creating hype in America for Mahesh movie

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు #SSMB29 ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్న సంగతి తెలిసిందే. ఇది భారతీయ సినిమాలో అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రీ ప్రొడక్షన్ దశ నుంచే ట్రెండింగ్ లో ఉంటోంది.ఇటీవల టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా.. మహేశ్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చేయనున్నట్లు రాజమౌళి వెల్లడించారు. ఇప్పుడు లేటెస్ట్ గా అమెరికాలో ‘బియాండ్ ఫెస్ట్’ లో మరోసారి SSMB29 మూవీపై హైప్ ఎక్కించారు.

జక్కన్న తెరకెక్కించిన RRR సినిమాని లాస్ ఏంజెల్స్ లోని చైనీస్ థియేటల్స్ లో ఉన్న అతిపెద్ద IMAX స్క్రీన్ లో స్పెషల్ గా ప్రదర్శించారు. దీనికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా 'నాటు నాటు' పాటకి డ్యాన్సులు వేస్తూ ఈలలు వేశారు.

ట్రిపుల్ సినిమా పూర్తైన తర్వాత వెస్ట్రన్ ఆడియన్స్ రాజమౌళికి స్టాండింగ్ ఒవియేషన్ ఇచ్చారు. ఈ రెస్పాన్స్ కు పొంగిపోయిన దర్శకధీరుడు.. అమెరికాలో ఫిలిం ఫెస్టివల్ కు వచ్చినట్లు లేదు.. అమీర్ పేట్ లో ఉన్నట్లు ఉందని అన్నారు. ఇండియాలోనే రౌడీ ఫ్యాన్స్ ఉంటారు అనుకున్నాను.. కానీ వెస్టర్న్ లోనూ ఉన్నారని అర్థమవుతుంది అన్నారు.

ఈ సందర్భంగా SSMB29 సినిమా గురించి రాజమౌళి మాట్లాడారు. ''మహేష్ బాబుతో నా తదుపరి చిత్రం ఇప్పటి వరకు నా కెరీర్ లో అతిపెద్ద చిత్రం అవుతుంది. గ్లోబ్ ట్రాటింగ్ ఫిల్మ్ అని చెప్పగానే.. ఇప్పటికే అది ట్రెండింగ్ అంశం. ఇదొక యాక్షన్ సినిమా అవుతుంది'' అని రాజమౌళి అన్నారు.

మహేష్ తో చేయబోయే చిత్రం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని రాజమౌళి చెప్పడంతో సూపర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. జక్కన్న ప్రాజెక్ట్ భారీగా ఉండబోతుందని సూచించడంతో.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సినిమా అవుతుందని ఆశిస్తున్నారు.

భారతీయ సినిమాలో అపజయం ఎదురుగని దర్శకుడు.. గత కొన్నేళ్లుగా వరుస హిట్స్ తో దూకుడు మీదున్న సూపర్ స్టార్ కలిసి చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. SSMB29 సినిమాతో మహేశ్ బాబు గ్లోబల్ స్టార్ గా మారుతాడని అభిమానులు భావిస్తున్నారు. మహేష్ సైతం ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ అని మేకర్స్ తెలిపారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇదే క్రమంలో రాజమౌళి - మహేష్ కాంబోలో సినిమా ఉంటుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.