తమిళ మీడియాకు రాజమౌళి క్షమాపణలు

Sun Nov 28 2021 14:01:40 GMT+0530 (IST)

Rajamouli apologizes to Tamil media

స్టార్ డైరెక్టర్ రాజమౌళి RRR పాన్ ఇండియా కేటగిరీలో పలు భాషల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ పీరియడ్ మల్టీ స్టారర్ యాక్షన్ డ్రామా జనవరి 7న విడుదలవుతోంది. ఇప్పటికే ప్రచారంలో వేగం పెంచిన సంగతి తెలిసిందే.ఇటీవల RRR ఆంథమ్ `జనని` విడుదల కాగా.. దానికి మంచి స్పందన దక్కింది. రాజమౌళి- చిత్ర నిర్మాత డివివి దానయ్య - ఆర్.ఆర్.ఆర్ తమిళ వెర్షన్ ను సమర్పిస్తున్న బ్యానర్ లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు చెన్నైలో జరిగిన జనని తమిళ వెర్షన్ `ఉయిరే` లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. గత 3 సంవత్సరాలుగా తమతో ఇంటరాక్ట్ కానందుకు తమిళ సినీ మీడియా సోదరులకు మొదట క్షమాపణలు చెప్పారు. జనవరిలో సినిమా విడుదలకు ముందు జరిగే గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ లో తప్పకుండా వారితో సంభాషిస్తానని రాజమౌళి హామీ ఇచ్చారు.

బాహుబలి ఫ్రాంఛైజీ చిత్రాలతో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పేరు తమిళ నాటా మార్మోగింది. శంకర్ కి ధీటైన దర్శకుడిగా సత్తా చాటిన రాజమౌళికి తమిళనాడులో ప్రత్యేక గౌరవం ఉంది. ఆయన నుంచి వచ్చే ఏ సినిమాకి అయినా అక్కడ  క్యూరియాసిటీ అంతే ఇదిగా ఉంటుంది. అందుకు తగ్గట్టే ఆర్.ఆర్.ఆర్ తమిళ హక్కుల కోసం లైకా సంస్థ భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.