Begin typing your search above and press return to search.

రాజమౌళి టాలీవుడ్ ను ముంచేశాడా..?

By:  Tupaki Desk   |   6 July 2022 3:30 PM GMT
రాజమౌళి టాలీవుడ్ ను ముంచేశాడా..?
X
భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరని అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తూ.. అపజయం ఎదురుగని డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెబుతున్నారు. అయితే బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం జక్కన్న వల్ల టాలీవుడ్ మునిగిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'బాహుబలి' ప్రాంఛైజీతో ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించారు రాజమౌళి. అయితే దీని కోసం ఐదేళ్లు సమయం తీసుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో ప్రాజెక్ట్ కమిట్ అవకుండా పూర్తిగా ఈ సినిమా కోసమే అంకితమయ్యారు. మామూలుగా ఐతే ప్రభాస్ ఈలోపు అర డజను సినిమాలైనా చేసేవాడు. కానీ రాజమౌళి కారణంగా రెండు చిత్రాలు మాత్రమే చేసాడు.

ఒక అగ్ర హీరో తరచుగా సినిమాలు చేస్తే ఇండస్ట్రీలో ఎంతో బిజినెస్ జరుగుతుంది. నటీనటుల దగ్గర నుంచి టెక్నిషియన్స్.. డైలీ వర్కర్స్ వరకూ ఎంతో మందికి పని దొరుకుతుంది. అంతేకాదు ఎక్కువ సినిమాలు చేసి అధిక మొత్తంలో సంపాదించుకోడానికి అవకాశం కలుగుతుంది. రెగ్యులర్ గా పెద్ద చిత్రాలు థియేటర్లలోకి వస్తే డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబిటర్స్ నుంచి ఎందరికో లాభం చేకూరుతుంది. ఈ విధంగా మనీ రొటేషన్ అవడం వలన ఇండస్ట్రీలో బిజినెస్ బాగా జరుగుతుంది.

'బాహుబలి' తెలుగు స్థాయిని పెంచింది కాబట్టి, ఆ సినిమాని మినహాయింపు ఇద్దాం అనుకుంటే.. దీంతో ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ వల్ల అదే రేంజ్ లో సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. దీని వల్ల ఒక్కో సినిమాకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. 'బాహుబలి 2' తర్వాత ఈ ఐదేళ్లలో డార్లింగ్ కేవలం రెండు చిత్రాలను మాత్రమే చేయడంతో కొన్ని కోట్ల బిజినెస్ తగ్గిందనే అనుకోవాలి. పరోక్షంగా దీనికి రాజమౌళి కూడా కారణమయ్యారని అనుకోవాలి.

ఇటీవల 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో మరోసారి సత్తా చాటారు జక్కన్న. దీని కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలను మూడున్నర ఏళ్ళు లాక్ చేసి పెట్టుకున్నారు. చరణ్ అయినా మధ్యలో 'ఆచార్య' చిత్రంలో నటించారు కానీ.. తారక్ మాత్రం 'అరవింద సమేత వీర రాఘవ' తర్వాత ట్రిపుల్ చిత్రానికే పరిమితమయ్యారు.

2010 నుంచి ఏడాదికో సినిమా చేస్తూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. గత నాలుగేళ్లలో ఒక్క RRR చిత్రంలో మాత్రమే కనిపించారు. దీని వల్ల తారక్ సినిమాల వల్ల జరిగే బిజినెస్ అంతా లేకుండా పోయింది. రామ్ చరణ్ కూడా ఈ మూడేళ్ళలో రెండు పెద్ద సినిమాలైనా చేసేవాడు. ట్రిపుల్ ఆర్ తో ఇద్దరు హీరోలు పాన్ ఇండియా స్టార్ అనే క్రేజ్ తెచ్చుకున్నారేమో గానీ.. రాజమౌళి ప్రాజెక్ట్ కారణంగా ఎక్కువ సినిమాలు చేయలేకపోయారనేది వాస్తవం.

ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయడానికి జక్కన్న రెడీ అవుతున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు దీని కోసం మూడేళ్ళపాటు మహేష్ ను లాక్ చేయబోతున్నారని అంటున్నారు. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ తర్వాత స్టార్ హీరో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడానికి చాలా టైం పడుతుంది.

టాలీవుడ్ లో రెగ్యులర్ గా సినిమాలు చేసే స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ బాబే. 'ఖలేజా' తర్వాత రూట్ మార్చిన సూపర్ స్టార్.. గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. మహేష్ లాంటి స్టార్ హీరో ఎక్కువ చిత్రాలు చేయడం వల్ల రొటేషన్ జరిగి బిజినెస్ జరగడానికి కారణమవుతుంటారు. కానీ ఇప్పుడు రాజమౌళి మూడేళ్లు మహేష్ ని తన ప్రాజెక్ట్ లో భాగం చేయనున్నారు. దీని వల్ల స్టార్ హీరో సినిమాల వల్ల జరిగే బిజినెస్ అంతా ఆగిపోయినట్లే.

రాజమౌళి భారీ సినిమాలు తీసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం గొప్ప విషయమే అయినప్పటికీ.. ఒక్కో సినిమాలు నాలుగైదేళ్లు టైం తీసుకోవడం.. ఇతర చిత్రాలు చేయకుండా హీరోలను బ్లాక్ చేయడం వలన ఇంకో రకంగా టాలీవుడ్ బిజినెస్ పై దెబ్బ పడేలా చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.