పదే పదే వెంటాడిన వరుణుడిపై జక్కన్న పంచ్

Mon Sep 23 2019 10:50:53 GMT+0530 (IST)

Rajamouli Throws Punch On Rain In Sye Raa Pre Release Event

తెలుగు సినిమా ప్రచార ఈవెంట్లు పరమ విచిత్రం. అర్థగంటలో పూర్తవ్వాల్సిన ఈవెంట్లను భజంత్రీ కార్యక్రమాల్లా పూటలకు పూటలు సాగదీస్తూ ఇప్పటికే బోలెడన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీటివల్ల గంటల కొద్దీ సమయం కాలార్పణం అవుతోంది. చెప్పాల్సినది సూటిగా చెప్పకుండా దంచుడు కార్యక్రమాలతో ఈ భజనేమిటి? అన్న విమర్శలు ఉన్నాయి. అప్పట్లో భారీ పాన్ ఇండియా సినిమా అంటూ `సాహో` ఈవెంట్ నిర్వహిస్తే పూర్తయ్యేసరికి మిడ్ నైట్ అయ్యింది. రాత్రి 11.30 తర్వాతే ఫ్యాన్స్ ఇంటికెళ్లారు. అభిమానులు ఇండ్లకు సేఫ్ గా వెళ్లాలన్నది హీరోల అభిమతం. కానీ ప్రతిసారీ అందుకు విరుద్ధంగానే జరుగుతుంటుంది.అయితే ఈ రూల్ ని సైరా భారీ ఈవెంట్ బ్రేక్ చేసింది. గత రెండు వారాలుగా నిరంతరం సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి ఆసక్తికర చర్చ సాగింది. సాహో ఈవెంట్ కి ధీటుగా ఈ వేడుకను ప్లాన్ చేసింది కొణిదెల బృందం. అందుకు తగ్గట్టే భారీగా అతిధులు విచ్చేశారు. సినీరాజకీయ ప్రముఖులు ఈవెంట్ కి వచ్చారు. వేలాదిగా మెగాభిమానులు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. అయిత ఇంత పెద్ద ఈవెంట్ కి ఆదిలోనే హంసపాదు అన్నట్టు వేడుక ప్రారంభం కాకముందే వరుణుడు ఝడిపించాడు. హైదరాబాద్ లో సాయంత్రం 6 సమయంలో చాలా చోట్ల భారీ వర్షం కురిసింది. అయితే లక్కీగా ఎల్బీ స్టేడియం వద్ద వర్షం పెద్దగా కురవలేదని యాంకర్ సుమ చెప్పారు.

కానీ వేదికపై భజంత్రీ కార్యక్రమాలు మాత్రం ఫుల్ గా టైమ్ వేస్టే చేశాయి. సాయంత్రం 6 నుంచి రకరకాల డ్యాన్సులు.. మెడ్లీలు.. ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు అంటూ చాలా సందడి సాగినా చివరికి వక్తలు స్పీచ్ లు ఇచ్చే టైమ్ వచ్చేప్పటికి వరుణుడు మరోసారి బరిలో దిగాడు. దాంతో ఈ వేడుకను హడావుడిగా ముగించేయాల్సి వచ్చింది. చిరు.. చరణ్ సహా అందరూ మబ్బులు చూసి చినుకుల్ని చూసి కొంత ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈవెంట్ లో స్పీచ్ లన్నిటినీ కుదించేసి `కట్టె కొట్టె తెచ్చే` అన్నట్టే ముగించేశారు. అలా 8.30 పీఎం కే వేడుకను క్లోజ్ చేసేశారు.

నిజానికి ఇది ఇంత సింపుల్ గా అవ్వాల్సిన కార్యక్రమం కానేకాదు. వేదికపై ఉన్న వక్తల స్పీచ్ లు అంత తేలిగ్గా ముగిసేవి కావు. కానీ తప్పలేదు. తెలుగు సినిమా హిస్టరీలో ఒక వేడుకను ఇంత త్వరగా ముగించేయడం అన్నది ఇలా ఎప్పుడూ జరగలేదు. సాధా సీదా ఈవెంట్లకే పూటంతా భజన చేస్తుంటారు. అలాంటిది ఇంత పెద్ద వేడుకను అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. టాలీవుడ్ లో ప్రతి ఈవెంట్ కి భజన పూర్తయ్యేసరికి 10.30 దాటాలి కదా. కానీ సైరా టీమ్ ని కంగారు పెట్టేసిన వర్షం తొందరగా ముగిసేలా చేసింది. దీనివల్ల వేదికపైకి అతిధులు వచ్చాక ఎక్కువ సమయం స్పెండ్ చేయడానికి లేకుండా పోయింది. ఓ వైపు చిటపటా వర్షం కురుస్తుంటే.. ఫ్యాన్స్ ఎంతో ఓపిగ్గా వేచి చూశారు.. తడుస్తూనే.. కార్యక్రమం వీక్షించారు. ఈ వేదికపై సైరా టీమ్ ని అభినందించిన ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ.. పైనుంచి వర్షం రూపంలో ఉయ్యాలవాడ దీవెనలు అంటూ ఛమత్కరించడం కొసమెరుపు. అదృష్టం కొద్దీ ఆ గంటసేపూ వరుణుడు శాంతించకపోతే ఇంత పెద్ద ఏర్పాట్లు చేసుకున్నందుకు కొణిదెల టీమ్ కి తీవ్ర నిరాశే ఎదురై ఉండేది. ఒక రకంగా ఉయ్యాలవాడ దీవెనలే అనుకోవాలి. ఈ ఈవెంట్ నేర్పిన పాఠం ఏమిటి అంటే.. టీవీ చానెళ్ల టీఆర్పీల కోసం పాకులాట కార్యక్రమాల్లా కాకుండా కనీసం వర్షా కాలం అయినా ఆలోచించి నిర్వహించాలన్నది విశ్లేషకుల సూచన.