దిల్ రాజు చేతికి రాజమౌళి .. మహేశ్ ప్రాజెక్ట్!

Wed Nov 24 2021 15:13:18 GMT+0530 (IST)

Rajamouli In The Hands Of Dil Raju  Mahesh Project

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా దిల్ రాజు దూసుకుపోతున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ఆయన ప్రేక్షకుల పల్స్ ను పట్టేశారు. ఏ హీరోతో ఎలాంటి కథలు చేయాలి? ఏ హీరో నుంచి అభిమానులు ఎలాంటి కథలను ఆశిస్తారు? అన్నివర్గాల ప్రేక్షకులను అలరించాలంటే ఒక కథలో ఏయే అంశాలు ఉండాలి? ఎలాంటి పాళ్లలో ఆ కథను వండాలి? అనే విషయాలపై ఆయన పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. ఇక ఏ కథకి ఎంత పెట్టాలి? ఏ సమయంలో ఆ సినిమాను రిలీజ్ చేయాలి? అనే విషయాల్లో కూడా ఆయనకి స్పష్టత ఉంది.ఇంత పరిశీలన .. అవగాహన .. అధ్యయనం .. అనుభవం ఉండటం వల్లనే ఆయన ఈ రోజున ఈ స్థాయి నిర్మాతగా కొనసాగుతున్నారు. శాకుంతలం .. ఎఫ్ 3 .. హిందీ జెర్సీ .. చరణ్ - శంకర్ మూవీ ఆయన చేతిలో ఉన్నాయి. ఇక ప్రభాస్ .. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కమిట్మెంట్లు ఉన్నాయి. ఆయన బ్యానర్ నుంచి తమ సినిమా రావాలని ఇటు ఆర్టిస్టులు .. అటు దర్శకులు కూడా ఆశిస్తూ ఉంటారు. చిన్న సినిమాలే అయినా కంటెంట్ కొత్తగా ఉందనిపిస్తే తన బ్యానర్ ద్వారా ఆ సినిమాను రిలీజ్ చేయడానికి దిల్ రాజు వెనకాడరు.

అలాంటి దిల్ రాజు .. రాజమౌళి తదుపరి సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉండనున్నాడనేది తాజాగా వినిపిస్తున్న న్యూస్. రాజమౌళి తాజా చిత్రమైన 'ఆర్ ఆర్ ఆర్' జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన మహేశ్ బాబు హీరోగా ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. గతంలో ఆయన శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై క్షణక్షణం .. హలో బ్రదర్ .. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు .. సంతోషం మొదలైన సినిమాలను నిర్మించారు. ఎన్నో భారీ విజయాలను అందుకున్న ఆయన కొంతకాలంగా వేరే బిజినెస్ లో బిజీగా ఉన్నారు.

ఇప్పుడు సినిమా బిజినెస్ లో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. అందువలన తనతో పాటు నిర్మాణ భాగస్వామిగా ఉండమని ఆయన దిల్ రాజును కోరారట. రాజమౌళి - మహేశ్ కాంబినేషన్ కి మార్కెట్ ఎలా ఉంటుందనేది దిల్ రాజుకు బాగా తెలుసు. అందువలన ఆయన ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఈ కాంబినేషన్లో త్వరలో ఒక పోస్టర్ పడనుందన్న మాట!