Begin typing your search above and press return to search.

శంక‌ర్.. రాజ‌మౌళి ఎవ‌రైతే ఏంటి?

By:  Tupaki Desk   |   12 Dec 2019 2:30 PM GMT
శంక‌ర్.. రాజ‌మౌళి ఎవ‌రైతే ఏంటి?
X
ఏదైనా భారీ చిత్రం ఆన్ లొకేష‌న్ నుంచి సీన్ లీక‌వ్వ‌డం.. లేదా ర‌ఫ్ క‌ట్ చేయ‌ని ఫుటేజ్ టెక్నిక‌ల్ టీమ్ నుంచి లీక‌వ్వ‌డం వ‌గైరా వ‌గైరా వ్య‌వ‌హారాలు ప‌లుమార్లు ప్ర‌కంప‌నాలు పుట్టించిన సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది .. ట్యాక్సీవాలా లాంటి చిత్రాలు మెజారిటీ భాగం ఆన్ లైన్ లో లీకైన‌ప్పుడు నిర్మాత‌లు గ‌గ్గోలు పెట్టారు. అయితే అందుకు కార‌కులైన వారిని సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు అప్ప‌గించారు.

ఇటీవ‌ల భారీ చిత్రాల‌కు సంబంధించిన లీకేజీలు నిరంత‌రాయంగా కొన‌సాగుతూనే ఉన్నాయి. బాహుబ‌లి ఫ్రాంఛైజీ స‌హా ఇటీవ‌ల రిలీజైన ప‌లు భారీ చిత్రాల ఫుటేజ్ లు లీక‌య్యాయి. ఇక 2.0 స‌మ‌యంలో శంక‌ర్ ని ఈ త‌ర‌హా లీకులు టెన్ష‌న్ కి గురి చేశాయి. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న భార‌తీయుడు 2 చిత్రానికి సంబంధించిన లీకులు వేడెక్కిస్తున్నాయి. ఇంత‌కుముందు రాజ‌మండ్రి సెంట్రల్ జైల్లో స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను ఫోటోల రూపంలో లీక్ చేసేశారు అభిమానులు. ఎన్టీఆర్ చిత్రం అర‌వింద స‌మేత లీకుల గురించి నిర్మాత‌లు కంగారు ప‌డ్డారు అప్ప‌ట్లో.

గ‌త కొంత‌కాలంగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - ఏ.ఆర్.మురుగ‌దాస్ కాంబినేష‌న్ మూవీ ద‌ర్బార్ కి సంబంధించిన లీక్డ్ ఫోటోలు అభిమానుల్లో వైర‌ల్ గా మారాయి. ర‌జ‌నీ-మురుగ‌దాస్ బృందం సైబ‌ర్ క్రైమ్ ని ఆశ్ర‌యించేంత‌వ‌ర‌కూ వెళ్లింది.

ఎవ్వర్ లేటెస్ట్ ఆర్.ఆర్‌.ఆర్ కి సంబంధించిన లీకులు క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన సాంగ్.. అలాగే మేకింగ్ వీడియోల లీకులు బ‌య‌ట‌కు రావ‌డంతో అవి కాస్తా వైర‌ల్ గా మారాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన రాజ‌మౌళి అండ్ టీమ్ లీక్డ్ వీడియోల‌కు సంబంధించిన లింకుల్ని సైబ‌ర్ క్రైమ్ సాయంతో తొల‌గించే ప‌నిలో ప‌డ్డారు. ప్ర‌ధాన మీడియాల్లోనూ ఈ లీకులు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇక ఇప్ప‌టికే ఎన్టీఆర్ .. చ‌ర‌ణ్ లుక్ లు లీకుల్లో బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇంకా అధికారికంగా రిలీజ్ చేయ‌క ముందే.. లీకులిస్తూ శంక‌ర్ అయినా రాజ‌మౌళి అయినా.. మురుగ‌దాస్ అయినా ఇదే మా స‌వాల్! అంటూ లీకు వీరులు మీసం మెలేస్తుండ‌డం ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ గా మారింది.