ఈసారి హిట్ కొడతానంటున్న యంగ్ హీరో..!

Tue Jan 18 2022 13:14:09 GMT+0530 (IST)

Raj Tarun Hopes On Stand Up Rahul

'ఉయ్యాలా జంపాల' సినిమాతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి బాగానే కష్టపడుతున్నాడు. 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యువ హీరో.. గతేడాది ప్రారంభంలో 'పవర్ ప్లే' చిత్రంతో నిరాశ పరిచాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అనుభవించు రాజా' సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో రాజ్ తరుణ్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.ప్రస్తుతం రాజ్ తరుణ్ ''స్టాండ్ అప్ రాహుల్'' అనే న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. 'కుర్చుంది చాలు' అనేది దీనికి ట్యాగ్ లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - 'అలా ఇలా' సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. రాజ్ తరుణ్ - వర్ష మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు సూచించాయి.

ఇప్పుడు రాజ్ తరుణ్ ఫోకస్ అంతా 'స్టాండప్ రాహుల్' సినిమా మీదనే ఉన్నట్లు తెలుస్తోంది. జీవితంలో దేనికోసం నిలబడని ఓ స్టాండ్-అప్ కమెడియన్.. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాక.. తన తల్లిదండ్రులు మరియు ప్రేమించిన అమ్మాయి కోసం ఎలా నిలబడ్డాడు అనేదే ఈ సినిమా కథాంశం అని తెలుస్తోంది.

'స్టాండ్ అప్ రాహుల్' చిత్రాన్ని సిద్ధు ముద్దా సమర్పణలో డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హై ఫైవ్ పిక్చర్స్ పతాకాలపై రూపొందిస్తున్నారు. నంద్ కుమార్ అబ్బినేని - భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో వెన్నెల కిషోర్ - మురళి శర్మ - ఇంద్రజ - దేవి ప్రసాద్ - మధురిమ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.

 స్వీకర్ అగస్తి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి రాజ్ తరుణ్ ఈ మూవీతో అయినా సరైన సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.