రాజ్ కుంద్రా జీవితమే వివాదాస్పదం

Wed Jul 21 2021 09:16:46 GMT+0530 (IST)

Raj Kundra's life is controversial

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. అశ్లీల కంటెంట్ ను సృష్టించాడనే ఆరోపణలతో సోమవారం రాత్రి ఆయన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది. అయితే కుంద్రాకు వివాదాలు ఇదే కొత్త కాదు.. అంతకుముందు చాలా వివాదాల్లో ఆయన అభాసుపాలైన చరిత్ర ఉంది.ఈ కేసులో కీలక కుట్రదారుడిగా కనబడుతున్నందున వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. కుంద్రాను అరెస్ట్ చేయడానికి తమ వద్ద సాక్ష్యాలున్నాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.  తాజాగా రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది.

-బెట్టింగ్ ఆరోపణలు
గతంలో రాజ్ కుంద్రాపై ఐపీఎల్ లో బెట్టింగ్ ఆరోపణలు వచ్చాయి.రాజస్థాన్ రాయల్స్ టీం సహ యజమానిగా రాజ్ కుంద్రా ఉన్నారు. ఆ బెట్టింగ్ ఆరోపణలతో రాజస్థాన్ ఫ్రాంచైజీపై నిషేధం కూడా పడింది. రాజ్ కుంద్రాతోపాటు ఐసీసీ మాజీ చీఫ్ ఎన్. శ్రీనివాస్ అల్లుడు గురునాథ్ మీయప్పన్ బెట్టింగ్ కేసులో దోషులుగా తేలారు.అయితే ఢిల్లీ పోలీసులు కుంద్రాకు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత 2018లో కుంద్రా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

-టెక్స్ టైల్ కంపెనీ చీటింగ్ కేసు
2017లో కుంద్రాపై ఒక వస్త్రపరిశ్రమ సంస్త చీటింగ్ కేసు పెట్టింది. రూ24 లక్షలు మోసం చేశాడని ఆరోపించింది. రాజ్ కుంద్రా అతడి భార్య శిల్పాశెట్టిలు సేకరించిన డబ్బులు తమకు ఇవ్వలేదని టెక్స్ టైల్ కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో కుంద్రాపై పోలీసులు కేసు పెట్టారు.

-బిట్ కాయిన్ స్కామ్
2018లో రాజ్ కుంద్రా బిట్ కాయిన్ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫూణే క్రైమ్ బ్రాంచ్ ప్రకారం కొంతమంది బాలీవుడ్ నటులు బిట్ కాయిన్ లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి అక్రమ కుంభకోణం చేశారని ఆరోపణలున్నాయి. ఈ రాకెట్ పై పోలీసులు దాడి చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. రూ.2వేల కోట్లు దొరికినట్లు చెబుతున్నారు.

-మాజీ భార్యపై ఎఫైర్ ఆరోపణలు.. కేసు
ఇక రాజ్ కుంద్రా ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ భార్య కవతకు.. దగ్గరి బంధువుతో ఎఫైర్ ఉందని ఆరోపించారు. అందుకే విడిపోయి శిల్పాశెట్టిని చేసుకున్నానని కుంద్రా తెలిపారు. దీనిపై మాజీ భార్య కేసు కూడా పెట్టింది.

ఇలా రాజ్ కుంద్రా చుట్టూ ఎప్పుడూ వివాదాలే ముసురుకున్నాయి. వరుస కేసులు వివాదాలతో ఆయన జీవితం కొనసాగింది. ఇప్పుడు తాజాగా అశ్లీల వీడియోల కేసు చుట్టుముట్టింది.