సైరా ఈవెంట్ ని వెంటాడిన వరుణుడు

Sun Sep 22 2019 20:57:47 GMT+0530 (IST)

Rain Effect on Sye Raa Movie PRe release Event

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `సైరా-నరసింహారెడ్డి` అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. సరిగ్గా పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎంత ప్రచారం చేసినా ఈ పదిరోజుల్లోనే. నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సైరా ప్రీరీలీజ్ వేడుకను భారీగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు జనసేనాని పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు.  వేలాదిగా మెగాభిమానులు విచ్చేశారు.వాస్తవానికి ఈ ఈవెంట్ అంతా సవ్యంగా జరిగితే కర్నూలులో జరగాల్సింది. అయితే అక్కడ భారీ వర్షాలతో ఈవెంట్ రద్దయిన సంగతి తెలిసిందే. నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో వేడుక కోసం కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ భారీగా స్టేజ్ నిర్మించి భారీ సెటప్ చేసింది. ఇక్కడా వరుణుడు మాత్రం కొణిదెల బృందాన్ని విడిచిపెట్టలేదు. సరిగ్గా సైరా ఈవెంట్ ప్రారంభానికి గంటన్నర ముందు హైదరాబాద్ లోనూ భారీ వర్షం కురిసింది. అయితే అప్పటికే వేలాదిగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. సరిగ్గా ఈవెంట్ ప్రారంభానికి ముందు వరుణుడు శాంతించడంతో ప్రస్తుతం లైవ్ సజావుగా సాగుతోంది. మరోసారి వరుణుడు ఇబ్బంది పెట్టకపోతే ఈవెంట్ మొత్తం గ్రాండ్ గానే సాగుతుంది.

ఇక ఈ ఈవెంట్ కి ట్యాలెంటెడ్ సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వేదిక వద్దకు పలువురు అతిధులు విచ్చేశారు. ఈ వేడుకకు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకధీరుడు రాజమౌళి- మెగా డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి -పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-మెగాబ్రదర్ నాగబాబు- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్- అల్లు శిరీష్- కళ్యాణ్ దేవ్ తదితరులు ఈ వేదికపైకి రానున్నారని తెలుస్తోంది. వేదిక పరిసరాల్లో మెగాస్టార్ చిరంజీవి  భారీ కటౌట్లు.. సైరా కటైట్లు ఆకట్టుకుంటున్నాయి.