ఆ నటుడి హోటళ్లపై అధికారుల దాడులు.. అసలు కారణం ఇదేనా?

Sun Sep 25 2022 13:10:40 GMT+0530 (India Standard Time)

Raids On Comedian soori Hotels

హాస్య నటుడు సూరి అన్నంతనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. అతగాడి ఫోటోను చూసినంతనే ఇతనేగా? అంటూ తెలుగు సినీ ప్రేక్షకులంతా ఇట్టే గుర్తు పట్టేస్తారు. హాస్య నటుడిగా సుపరిచితుడు.. అగ్ర హీరోల సినిమా ఏదైనా సరే.. అతడికో పాత్ర మాత్రం గ్యారెంటీ. కామెడీ నటుడి నుంచి కథానాయకుడిగా ఎదిగిన తీరులో మాత్రం అతడ్ని అభినందించకుండా ఉండలేం. ఓవైపు నటుడిగా తన టాలెంట్ ప్రదర్శిస్తూనే.. మరోవైపు ఆయనలోని వ్యాపారస్తుడ్ని ప్రజలకు పరిచయం చేశారు. అలాంటి సూరికి తాజాగా అధికారులు షాకిచ్చారు.సినీనటుడిగా సుపరిచితుడైన సూరికి.. తమిళనాడులోని మధురైతో పాటు.. పలు ప్రాంతాల్లో హోటళ్లు ఉన్నాయి. 'అమ్మన్' పేరుతో ఆయన హోటళ్ల చైన్ ను నిర్వహిస్తున్నారు. ఆయన హోటళ్లలో అందరిని ఆకర్షించే అంశం.. తక్కువ ధరకు నాణ్యమైన ఫుడ్ ఇస్తారన్న పేరు ఉంది. అందుకే..ఆయన వ్యాపారాలు మూడు ఇడ్లీలు.. ఆరు వడలు అన్నట్లు సాగుతుంటాయి. పూర్తిస్థాయి శాఖాహారాన్ని వండి వడ్డించే ఈ హోటళ్లపై తాజాగా వాణిజ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించటం సంచలనంగా మారింది.

మంచి పేరున్న హోటళ్ల మీద ఒక్కసారిగా జీఎస్టీ అధికారులు దాడులు చేయాల్సిన అవసరం ఏమిటంటే.. ఆయన హోటళ్లు నిర్వహించే ప్రాంతాల్లోని ఇతర హోటల్ యజమానులు కంప్లైంట్ చేయటమేనని చెబుతున్నారు. తక్కువ ధరలకు.. నాణ్యమైన ఫుడ్ ఎలా ఇస్తున్నాడన్నది ప్రశ్నగా తనిఖీలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారాన్ని చూస్తే.. హోటళ్లలో అమ్ముతున్న ఫుడ్ ధరల పట్టికను చూస్తే.. జీఎస్టీ చెల్లించటం లేదన్న విషయాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో.. ఆయనకు నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. ఒక ప్రముఖ నటుడికి చెందిన పలు హోటళ్లలో ఒకేసారి తనిఖీలు నిర్వహించే వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.