'శ్రీరామదాసు' దర్శకుడిగా నా జన్మ ధన్యం : దర్శకేంద్రుడు

Wed Aug 05 2020 12:20:35 GMT+0530 (IST)

Raghavendra Rao Tweet On Ayodhya Ram Bhoomi

అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. భూమి పూజ కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామాలయ నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 3 అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతంగా మందిరాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి భూమిపూజ నేడు మధ్యాహ్నం అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 08 సెకన్లకు ప్రారంభమై 12 గంటల 44 నిమిషాల 40 సెక్షన్లలోపు పూర్తవుతుంది. నిన్ననే మొదలైన పూజలు.. భూమిపూజతో బుధవారం మధ్యాహ్నానికి పూర్తవుతాయి. ఇక ఈ కార్యక్రమానికి మొత్తం 175 మంది అతిథులు హాజరుకానున్నారు.కాగా అయోధ్య నగరంలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న సందర్భంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ''ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన రామభక్తుల కల నిజమైన రోజు ఇది. 'శ్రీరామదాసు' సినిమాను డైరెక్ట్ చేసిన వ్యక్తిగా ఎప్పటికీ గర్వపడతాను'' అని తెలిపారు. అంతేకాకుండా తన దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో తెరకెక్కిన 'శ్రీరామదాసు' చిత్రంలోని రామ ఆగమన సన్నివేశానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఇదొక గొప్ప క్షణమని సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.