Begin typing your search above and press return to search.

వారసుడి కోసం దర్శకేంద్రుడి స్కెచ్!

By:  Tupaki Desk   |   18 July 2019 1:30 AM GMT
వారసుడి కోసం దర్శకేంద్రుడి స్కెచ్!
X
వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన అపార అనుభవంతో టాలీవుడ్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు గారికి ఆయన వారసుడు ప్రకాష్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఎంతో కొంత నిరాశనైతే కలిగిస్తూ ఉంటుంది. నిజానికి ప్రకాష్ తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఉషాకిరణ్ సంస్థ నిర్మించిన నీతో అతని ఫస్ట్ మూవీ. ఫలితం డిజాస్టర్. హీరో లుక్స్ పరంగా కామెంట్స్ రావడంతో రెండో ప్రయత్నం జరగలేదు.

దర్శకుడిగా నాన్న బాటలో నడుద్దామని సిద్దార్థ్ హీరోగా రూపొందిన భారీ ఫాంటసి సబ్జెక్టు అనగనగా ఒక ధీరుడు సైతం నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత అనుష్కతో చేయించిన సైజ్ జీరో ఫలితం కూడా అంతే. ఇక్కడ లాభం లేదని బాలీవుడ్ వెళ్లి కంగనా రౌనత్ తో చేసిన జడ్జ్ మెంటల్ హై క్యా త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉండగా తెలుగులో మరోసారి ప్రకాష్ ని నిలబెట్టేందుకు రాఘవేంద్ర రావు మరో ఛాన్స్ సిద్ధం చేసినట్టు తెలిసింది. నాగ శౌర్య హీరోగా మూడు ప్రేమ కథలు ముగ్గురు దర్శకులు కాన్సెప్ట్ లో ఇతన్ని భాగం చేశారట.

ఒక పార్ట్ క్రిష్ టేకప్ చేయగా మరో పార్ట్ ప్రకాష్ తీస్తారని తెలిసింది. మూడో దర్శకుడు ఎవరో ఇంకా పేరు బయటికి రాలేదు. నాగ శౌర్యకు ప్రమాదం జరగడం ఆ తర్వాత అశ్వద్ధామ షూటింగ్ లో బిజీ కావడం లాంటి కారణాల వల్ల ఇది ప్రారంభించడం లేట్ అవుతోంది. ఈలోగా ప్రకాష్ అద్వర్యంలోనే స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయట. మరి ఇప్పుడైనా ప్రకాష్ తన మార్కు టాలెంట్ తో హిట్ కొడతాడో లేదో చూడాలి. దానికన్నా ముందు ఇతని జడ్జ్ మెంటల్ హై క్యా ఫలితం ఓ ఐడియా ఇచ్చేస్తుంది. చూద్దాం