ఫేమస్ హస్తసాముద్రికుడి లైఫ్ స్టోరీ ప్రేరణగా 'రాధే శ్యామ్' లో ప్రభాస్ పాత్ర..?

Wed Oct 27 2021 12:02:40 GMT+0530 (IST)

Radhe Shyam inspired by the life story of famous palmist

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''రాధే శ్యామ్''. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో వింటేజ్ ప్రేమకథగా దర్శకుడు కె కె రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో విక్రమాదిత్య అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. విక్రమాదిత్య ఎవరు? ఎలా ఉండబోతున్నాడు? ఏం చేయబోతున్నాడు? అనే ప్రశ్నలకి డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ తో సమాధానం చెప్పారు.'రాధే శ్యామ్' టీజర్ లో ప్రభాస్ ను హస్తసాముద్రికా నిపుణుడిగా (పామిస్ట్).. భవిష్యత్ ను చెప్పగలిగే జ్యోతిష్కుడుగా చూపించారు. 'నా పేరు విక్రమాదిత్య.. నేను దేవుడిని కాదు.. కానీ నేను మీలో ఒకడిని కూడా కాదు' అంటూ ప్రభాస్ ఇందులో ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ లో కనిపించబోతున్న విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. రెబల్ స్టార్ సరికొత్త లుక్ లో.. బాడీ లాంగ్వేజ్ - డైలాగ్ డెలివరీలో వెరీయేషన్ చూపించారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

అయితే దర్శకుడు రాధాకృష్ణ కుమార్ 'రాధే శ్యామ్' చిత్రంలో విక్రమాదిత్య పాత్రను ఓ రియల్ లైఫ్ పామిస్ట్ ని ప్రేరణగా తీసుకొని క్రియేట్ చేశారని రూమర్స్ వస్తున్నాయి. ప్రముఖ హస్తసాముద్రిక నిపుణుడు చెయిరో విలియం జాన్ వార్నర్ లైఫ్ స్టోరీ ప్రేరణగా ఈ కథాంశాన్ని రెడీ చేశారని అనుకుంటున్నారు. చెయిరో గా ప్రసిద్ధి చెందిన విలియమ్.. ఐరిష్ కి చెందిన ఫేమస్ జ్యోతిష్కుడు. తన హస్తసాముద్రికం మరియు సంఖ్యాశాస్త్రంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వ్యక్తి.

రాజుల మరణాలు.. ప్రపంచంలోని వివిధ సంఘటనలు మరియు భవిష్యత్ లో జరగబోయే ఇతర అంశాలను అంచనా వేయడంలో చెయిరో విలియం ప్రసిద్ది చెందాడు. ఈయన 1880లలో భారతదేశంలో జ్యోతిష్యశాస్త్ర నైపుణ్యాన్ని నేర్చుకున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు అలాంటి ఫేమస్ పామిస్ట్ జీవితం ఆధారంగానే ''రాధే శ్యామ్'' ఫ్లాట్ ని రాధాకృష్ణ కుమార్ రెడీ చేశారని.. వాస్తవ కథను కమర్షియల్ పంథాలో తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

'రాధే శ్యామ్' టీజర్ ని బట్టి చూస్తే ఇది నిజమేమో అనిపిస్తుంది. 'నువ్వు ఎవరో నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు కానీ నీకు ఏదీ చెప్పను.. చెప్పినా మీ ఆలోచనలకి అందదు' అంటూ విక్రమాదిత్య పాత్రను ఈ వీడియోలో పరిచయం చేశారు.

అలానే టీజర్ లో కనిపించిన ఓ మ్యాగజైన్ పై 'ఇండియన్ ఎమర్జెన్సీని అంచనా వేసిన వ్యక్తి' అంటూ ప్రభాస్ ఫోటోని ముద్రించి ఉండటం కనిపిస్తుంది. ఇదంతా చూస్తే ఫఫేమస్ పామిస్ట్ చెయిరో విలియమ్ లైఫ్ స్టోరీ ప్రేరణగా విక్రమాదిత్య పాత్రను రెడీ చేస్తున్నారనే వార్తల్లో నిజం ఉందనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రసిద్ధ పామిస్ట్ కథలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్న 'రాధే శ్యామ్' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

కాగా 'రాధే శ్యామ్' సినిమాలో సైన్స్ కి జ్యోతిష్యానికి లింక్ చేస్తూ 1970ల నాటి ప్రేమ కథను చూపించబోతున్నట్లు తెలుస్తుంది. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ - గీతాకృష్ణ సంస్థలు కలసి భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - భూషణ్ కుమార్ - ప్రశీద దీనికి నిర్మాతలు. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీతో పాటుగా చైనీస్ జపనీస్ బాషల్లోనూ 'రాధే శ్యామ్' సినిమా రిలీజ్ కానుంది.