Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ కు RRR టీమ్..!

By:  Tupaki Desk   |   30 July 2021 1:30 AM GMT
ఉక్రెయిన్ కు RRR టీమ్..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ''ఆర్ ఆర్ ఆర్'' (రౌద్రం రణం రుధిరం). గత మూడేళ్ళుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి దశకు వచ్చేసింది. ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి అయింది. జక్కన్న ఈ పాటని ఉక్రెయిన్ లో సెట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో పెండింగ్ ఉన్న ఈ పాట కోసం రేపు (జూలై 30) చిత్ర బృందం ఉక్రెయిన్ వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ‌స్ట్ రెండో వారం వ‌రుకు అక్క‌డే షూటింగ్ జరుపుతారని సమాచారం. దాంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం ముగిసిన‌ట్లే అని చెప్పవచ్చు. భారీ ఖర్చుతో షూట్ చేయనున్న ఈ సాంగ్.. సినిమాలోని హైలైట్స్ లో ఒకటిగా చేరుతుందని అనుకుంటున్నారు. దీని కోసం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేసినట్లు ఇన్సైడ్ టాక్.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని భాషలకు సంబంధించిన బిజినెస్ క్లోజ్ చేశారు. ఆడియో రైట్స్ ని కూడా భారీ ధరకు అమ్మేశారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో షూటింగ్ తో పాటుగా ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ మరోవైపు ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. చెప్పిన సమయానికి సినిమాని రెడీ చేయడానికి డే అండ్ నైట్ కష్ట పడుతున్నారు. దీని కోసం రాజమౌళి తో పాటుగా తనయుడు కార్తికేయ మరియు మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పాపులర్ సింగర్ అనిరుధ్ తో కలిసి RRR ప్రమోషనల్ సాంగ్ ని సిద్ధం చేశారు. అలానే ఆగస్టు 1న ఫస్ట్ సింగిల్ 'దోస్తీ' సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరుడు' షో లో ట్రిపుల్ ఆర్ కోసం స్పెషల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విడుదల తేదీ దగ్గర పడే కొద్దే ఇతర ప్రమోషనల్ కంటెంట్ ని కూడా వదులుతారు. దీని కోసం మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి వినూత్నమైన స్ట్రాటజీలను రెడీ చేస్తున్నారట.

ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తుంటే.. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపించనున్నారు. వీరికి జోడీగా ఒలివియా మోరిష్ - ఆలియా భట్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ - సముద్రఖని - శ్రియ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య సుమారు 450 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.