లాస్ ఏంజిల్స్ టైమ్స్ లో 'RRR'

Thu Jun 30 2022 15:05:56 GMT+0530 (IST)

'RRR' in the Los Angeles Times

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన పీరియాడిక్ ఫిక్షనల్ విజువల్ వండర్ 'RRR'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల తొలి కలయికలో భారీ మల్టీస్టారర్ గా ఈ మూవీని రూపొందించారు. భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకుని హాట్ టాపిక్ గా మారింది.చరిత్రలో నిలిచిపోయిన లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు కొమురం భీం లు కలిస్తే.. కలిసి బ్రిటీష్ వారిపై తిరుగుబాటు బావుటాని ఎగురవేస్తే ఎలా వుంటుంది అనే కాల్పణిక కథతో దర్శకుడు రాజమౌళి తనదైన విజన్ తో ఈ మూవీని తెరకెక్కించిన తీరు సర్వత్రా ప్రశంసలు కురిపించింది.

రామ్ చరణ్ ఎన్టీఆర్ పాత్రలని మలిచిన తీరు కొమురం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ చేత పలికించిన భిన్నమైన హావ భావాలు.. స్పెల్ బౌండ్ చేసే పోరాట ఘట్టాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని సినిమాకు బ్రహ్మరథం పట్టేలా చేశాయి.

ఇక ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై సంచలనాలు సృష్టించిన ఈ మూవీ గత నెల 20న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లైన జీ5 నెట్ ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. నెట్ ఫ్లిక్స్ లో మాత్రం హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతూ మాలీవుడ్ స్టార్ల ప్రశంసలతో పాటు మాలీవుడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ మూవీపై హాలీవుడ్ స్టార్స్ రైటర్స్.. సోషల్ మీడియా వేదికగా షాకింగ్ కామెంట్ లు చేస్తున్నారు.

దీంతో 'RRR' హాలీవుడ్ లో మరింతగా వైరల్ అవుతూ వస్తోంది. ఇప్పటికే పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుంటూ చరిత్ర సృష్టిస్తున్న 'RRR' హాలీవుడ్ క్రిటిక్స్ దృష్టిని ఆకర్షించి అరుదైన ఘనతని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  క్రిటిక్స్ పేర్కొన్న హాలీవుడ్ టాప్ 10 సినిమాల జాబితాలో స్థానాన్ని సొంతం చేసుకున్న తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది.

తాజాగా ఈ మూవీ మరో ఘనతని సాధించి అబ్బురపరుస్తోంది. లాస్ ఏంజిల్స్ టైమ్ 2022 బెస్ట్ మూవీస్ జాబితాను తాజాగా ప్రచురించింది. ఈ జాబితాలో హాలీవుడ్ సినిమాలతో పాటు 'RRR' కూడా స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషంగా చెబుతున్నారు. ఈ జాబితాలో మొత్తం 11 చిత్రాలని బెస్ట్ మూవీస్ గా పేర్కొన్నారు. అందులో 'RRR' పదవ స్థానంలో నిలబడటం విశేషం. ఇదే విషయాన్ని 'RRR' టీ మ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.