ఆర్ఆర్‌ఆర్ ప్రతిష్టాత్మక అవార్డులకు నామినేట్

Sat Aug 13 2022 18:03:22 GMT+0530 (India Standard Time)

RRR has been nominated for prestigious awards

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుని.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో కూడా ఎన్నో దేశాల్లో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండ్ అవుతోంది.ఏ ఒక్క ఇండియన్ సినిమాకు కూడా దక్కని ఎన్నో రికార్డులను ఆర్ ఆర్ ఆర్ దక్కించుకుంది. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డులకు నామినేట్ అవ్వడంతో అరుదైన ఘనత దక్కించుకుంది.

సాటర్న్ అమెరికన్ అవార్డుల నామినేషన్స్ ను జక్కన్న సినిమా దక్కించుకుంది. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన డాక్టర్ స్ట్రేంజ్.. స్పైడర్ మ్యాన్.. బ్యాట్ మన్ సినిమాలు మాత్రమే దక్కించుకున్న సాటర్న్ అవార్డుల నామినేషన్స్ ను ఆర్ ఆర్ ఆర్ కూడా దక్కించుకోవడం పట్ల యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా విషయాన్ని షేర్ చేశారు.

సినిమా మూడు విభాగాల్లో నామినేషన్ ను దక్కించుకుంది. ఫిల్మ్ డైరెక్షన్.. యాక్షన్/అడ్వంచర్ మూవీ... ఇంటర్నేషనల్ సినిమా. ఈ మూడు కేటగిరీల్లో నామినేషన్స్ ను దక్కించుకున్నట్లుగా సినిమాకు వీఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్ గా చేసిన శ్రీనివాస్ మోహన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. చిత్ర యూనిట్ సభ్యులకు ప్రతిష్టాత్మక అవార్డు నామినేషన్స్ పొందినందుకు గాను కాంగ్రెస్ తెలియజేశాడు.

హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి మరీ ఆర్ ఆర్ ఆర్ సినిమా సాటర్న్ అవార్డ్ రేసులో నిలువబోతుంది. ఈ అవార్డు కార్యక్రమం ఈ ఏడాది అక్టోబర్ 25వ తారీకున భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. అవార్డు ను సొంతం చేసుకోకున్నా కూడా నామినేషన్ దక్కించుకోవడం గొప్ప విషయం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో అల్లూరి పాత్రలో రామ్ చరణ్ నటించగా.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించిన విషయం తెల్సిందే. బాహుబలి సినిమా స్థాయి వసూళ్లు దక్కించుకోలేక పోయినా కూడా ఓటీటీ ద్వారా అత్యధిక దేశాలకు ఈ సినిమా చేరువయ్యింది. రాజమౌళి సినిమా లో విజువల్స్ అద్భుతం అన్నట్లుగా ఉంటాయి.. అది మరోసారి ఆయన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందు ఉంచాడు.